Sunday, July 20, 2008

మనం మాట్లాడేది తెలుగేనా?

మనం మాట్లాడేది తెలుగేనా అని చాలాసార్లు నాకనుమానం వస్తుంది. ఈ అనుమానం వెనక ఓ కారణం ఉంది. ఎప్పుడో రెండు మూడేళ్ళ క్రితం అనుకుంటాను, టీవీలో ఓ కార్యక్రమం. ఒక విషయాన్నిచ్చి ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా తెలుగులో దాని గురించి మాట్లాడాలి. పాపం అందులో పాల్గొనే తెలుగు జనాలు చాలా కష్టపడి ప్రయత్నించేవారు. అయినా అలా చేసి గెలిచేవారి సంఖ్య చాలా చాలా తక్కువ. ఇది చూసాక, నన్ను నేను గమనించడం మొదలుపెట్టాను. అలా చేసినప్పుడు నేను రోజువారీ సంభాషణల్లో ఎన్ని ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడుతున్నానో గమనించేసరికి నాకు మతి పోయినంత పనయ్యింది!

నాకు తెలుగు సాహిత్యమన్నా భాషన్నా చిన్నపట్నించీ కాస్త అభిమానం ఎక్కువే. అలాంటి నేను, సహజంగా మాట్లాడే సంభాషణల్లో ఇన్నేసి ఇంగ్లీషు పదాలు వాడుతునానని తెలుసుకొనేసరికి, చెప్పొద్దూ, చాలా సిగ్గేసింది. ఇంకొంచెం పరిశీలిస్తే, నేను వాడే ఇంగ్లీషు పదాలకి ఇంచుమించు తొంభైశాతం సాధారణ తెలుగు పదాలు ఉన్నాయని కూడా అర్థమయింది! ఇక నా తలెక్కడపెట్టుకోవాలో నాకే తెలియలేదు. అప్పటినించీ ఓ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. రోజువారీ సంభాషణల్లో, తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగు పదాలున్నవాటికి ఖచ్చితంగా తెలుగే వాడాలన్నది ఆ వ్రతం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదట్లో ఇది అంత సులభమైన పని అని నేననుకోలేదు. కానీ ప్రయత్నించడం మొదలుపెట్టాక అది చాలా చాలా తేలిక అనిపించింది!
ఇప్పుడు మా ఆవిడా, అమ్మాయి మాట్లాడే తెలుగు కర్ణకఠోరంగా వినిపిస్తోంది నాకు :-( పాపకి ఇంగ్లీషు రావాలంటే, రోజూ కొంత సేపు ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడమని, మామూలుగా తెలుగులో మాట్లాడేటప్పుడు దాన్లో అనవసరమైన ఇంగ్లీషు పదాలు వాడొద్దనీ, రెండూ కలిపి మాట్లాడితే ఏ భాషా సరిగా రాదనీ నచ్చచెప్పడం మొదలుపెట్టాను. పాపం వాళ్ళు నా ఘోషని కొంతలో కొంత అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను.

మనం మాట్లాడే తెలుగు భాషలో ఇంగ్లీషు పదాలు చోటుచేసుకోడం ఒక సహజ పరిణామం, దాన్ని అడ్డుకోడం మూర్ఖత్వం అనే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళనడిగే ప్రశ్న ఒక్కటే, ఇది "సహజ" పరిణామమని మీరెందుకనుకుంటున్నారు? ఎక్కువమందిలో ఇది కనిపించినంత మాత్రాన అది సహజమని అనగలమా? ఒక్కసారి ఆలోచించండి.
మనం మాట్లాడే భాషలో ఇంగ్లీషు పదాలు చొచ్చుకురావడం వెనక రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి అసంకల్పితం, మరొకటి తెచ్చి పెట్టుకొంటున్న తద్దినం.
పరదేశంలోనో, స్వదేశంలోనే అయినా బహుళజాతి సంస్థలలోనో పనిచేస్తున్న వారు రోజంతా మాట్లాడేది ఇంగ్లీషులోనే. ఇది తప్పనిసరి. దీనివల్ల మన ఇతర సంభాషణల్లో కూడా, మనకి తెలీకుండానే ఇంగ్లీషు పదాలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు తీవ్రంగా ఏదైనా చర్చించాలంటే, పూర్తిగా ఇంగ్లీషులోకి వెళ్ళిపోడం కూడా తరచూ జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆపడం అంత సులుభం కాదు. అయితే, నాలా తెలుగుభాష మీద ఇష్టం ప్రకోపించినవాళ్ళు (కొవ్వలివారి పరిభాషలో తెలుగుచేసిన వాళ్ళు) ప్రయత్న పూర్వకంగానే దీన్ని మార్చుకోవాలి. నేనింతకుముందు చెప్పినట్టు ఇది అనిపించేంత కష్టం కాదు.
ఇక తెచ్చిపెట్టుకొంటున్న తద్దినం ఏమిటంటే, ఇలా ఇంగ్లీషు ముక్కలు కలిపి మాట్లాడ్డమే ఈనాటి ఫేషననీ, అలా చెయ్యక అచ్చమైన తెలుగులో మాట్లాడేవాళ్ళు రాతియుగంలో గుహల్లో బతికేవాళ్ళనీ కొంతమందిలో ఒక బలమైన విశ్వాసం మశూచికన్నా ఘోరమైన అంటువ్యాధిలా పాకిపోతోంది. ఇలా మాట్లాడితేనే ఇంగ్లీషు భాష వస్తుందన్న అభిప్రాయం ఇందులో మరో అంశం. వీటికి ముఖ్యమైన వాహకాలు సినిమాలూ, టీవీ ఛానళ్ళూ, మన "కల్చరు"ని పెంచి పోషిస్తున్న ఇతర సాధనాలూను. ఈ అంటురోగాన్ని నివారించడానికి ఎదోఒకటి చెయ్యకపోతే, మన భాష సంకర భాష అయిపోయే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.

మరి మీరేమంటారు?

21 comments:

Kranthi M said...

నేను మీరు చెప్పిన దానితో అ౦దుకే మీరు చేపట్టిన ప్రతినకి నా వ౦తు సహాయాన్ని అ౦దిస్తున్నాను.అన్యదా భావి౦చక౦డి.మీ వ్యాస౦లో ’ఈనాటి ఫేషననీ ’ పొరపాటున రాసినట్టున్నారు.సరిదిద్దుకోగలరు.

Kathi Mahesh Kumar said...

వ్రతంపట్టి మరీ వాడుక భాషలో ఆంగ్లప్రక్షాళన చెయ్యఖ్ఖరలేదు. అది అసాధ్యం కూడా.తెలుగు మాట్లాడటానికి ప్రొత్సహించడంలో ఎలాంటి తప్పూలేదు. కానీ ఆ తెలుగులో కొన్ని(ఎక్కువ)ఆంగ్లపదాలు దొర్లినంత మాత్రానా "సంకరం" అన్నంత బాధపడనవసరం లేదనుకుంటా.

తెలుగు మాట్లాడితే గౌరవం తక్కువ అని ఎవరూ అనుకోరుగానీ, కొన్ని ఆంగ్లపదాలు కలపకపోతే గౌరవం తక్కువవడం మాత్రం సామాజిక నిజం. అదిప్పుడొక అవసరం.అదొక పెద్ద చర్చావిషయమే కాదని నా నమ్మకం.

మీరు నిజంగా తెలుగుభాషకు సేవచెయ్యాలంటే ఇలాంటి అతివాదాలు,అపోహలూ మాని పిల్లలచేత తెలుగు చదివించడం,అదీ ముఖ్యంగా కథలూ మొదలైనవి చదివించడానికి ప్రోత్సహిస్తే చాలనుకుంటా.

Anonymous said...

మంచి విషయాన్ని లేవనెత్తారు. మీరు చెప్పినదాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అవసరం లేకపోయినా ఇంగ్లీషు పదాలను కలిపేసి భాషను సంకరం చేస్తూ ఉంటాం. (ముమ్మాటికీ అది సంకరం చెయ్యడమే! ఆ పని చేస్తున్నందుకు బాధ పడాల్సిందే!!) వాటిని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

మహేష్ గారూ, తెలుగు భాషకు సేవ చెయ్యాలంటే మరో పద్ధతి కూడా ఉంది.. ఇలాంటి అభిప్రాయాలలోని స్ఫూర్తిని గుర్తించి, వీటిని అతివాదాలుగా చిత్రించకుండా ఉన్నా సరిపోతుందనుకుంటా.

చైతన్య కృష్ణ పాటూరు said...

సరిగ్గా చెప్పారు. జనం అనుకున్నట్లు ఇంగ్లీష్ పదాలు లేకుండా మాట్లాడటం అంత కష్టమేమి కాదు. నేను ఈ వ్రతాన్ని చాలా రోజుల క్రిందటే మొదలు పెట్టాను. మాట్లాడేటప్పుడు అసంకల్పితంగా ఇంగ్లీష్ పదం వచ్చినా, వెంటనే దానికి సంబంధించిన తెలుగు పదం కూడా గుర్తు చేసుకునే వాడిని, బయటకి అనేసే వాడిని. ఇప్పుడు చాలా సులువుగా వుంది. నా తీరుకి అలవాటుపడ్డ నా మిత్రులు కూడా అచ్చ తెలుగు పదాలు కొన్ని వాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు మా గుంపులో జనాలందరు నెనర్లు అనే పదాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. తెలుగులో సరైన పదాలు లేనిచోట పరభాషా పదాలు వాడటం సహజమే, కానీ మంచి సుళువైన పదాలు వున్న చోట కూడా వేరే పదాలు వాడటం ఖచ్చితంగా సమర్థించకూడని విషయం.

భాష అనేది నది లాంటిది. అది కాలంతో పాటూ ప్రవహిస్తూ ఎన్నో పరభాషా పదాలను కలుపుకుంటుంది. స్వచ్చమైన భాషంటూ ఏదీ వుండదేమో. ఇప్పటి మన తెలుగు కూడా అలా మార్పు చెంది వచ్చిందే కదా. కానీ ఆ వచ్చి చేరే పదాలు భాష తాలూకు ప్రాథమిక స్వభావాన్ని మార్చనంత వరకు సమస్య లేదు. మొదట్లో ఏ కొత్త పదాన్నైనా చేర్చే ముందు దాన్ని పరిశీలించి, అవసరమైతే మన భాషకు తగినట్టు మార్చి తర్వాత దానికి ప్రాచుర్యం కల్పించేవారు. అలా కాకుండా భాషని కర్ణకఠోరంగా మార్చే పదాల వాడుక పట్ల కొంచం జాగ్రత్త వహించాలి. అందులో చాదస్తం ఏమి లేదు.

రవి said...

భాష జీవికోపయోగి. భావాలను వ్యక్తపర్చడానికి భాష. మాట్లాడేటప్పుడు కాస్త ఆంగ్ల పదాలు కలిసినంత మాత్రాన ఇబ్బంది లేదని నా ఉద్దేశ్యం.

ముత్తేవి రవీంద్రనాథ్ గారి "తెనాలి రామకృష్ణ కవి ఓ శాస్త్రీయ పరిశీలన" అన్న పుస్తకం చదువుతున్నాను. ఇందులో పుస్తక రచయిత ఓ చోట తెనాలి రామకృష్ణ కవి కవిత్వంలో కన్నడ పదాల గురించి ప్రస్తావించాడు.

అలానే తిరుమల రామచంద్ర గారి "నుడి నానుడి" పుస్తకంలో ఆయన మన సాధారణ తెలుగు పదాలు కూడా తెలుగు నుండీ కాక పర భాషల నుండీ గ్రహించ బడ్డాయి అని విశ్లేషణాత్మకంగా చెబుతారు.

అలానే అన్నమయ్య కృతులలో ఎన్నో పదాలు ఇప్పుడు (వాడుక భాష)లో లేవు.

అలాంటి పరిణామమే తెలుగులో ఆంగ్ల పదాల చేరిక. ఇది 'సహజ పరిణామమా ? అసహజమా? ' ఇది అంత చర్చనీయాంశమైన విషయంగా నాకు కనిపించడం లేదు. ఎందుకంటే ఇలా వాదంచడం వల్ల నిజానిజాలు తేలకపోవడం అటుంచి, భిన్న వాదాలు మొదలయే అవకాశం ఉన్నది.

ఆంగ్ల పదాల చేరిక వలన తెలుగు భాష పరిపుష్టం అవుతుంది కనీ సంకరం కాదు అని నా ఉద్దేశ్యం.

అయితే భైరవభట్ల గారి 'తెచ్చిపెట్టుకున్న తద్దినం '. ఇది కాస్త వెగటు వ్యవహారమే.

భైరవభట్ల గారిది తీవ్రమైన అభిమానం అయుండవచ్చునేమో కానీ అతివాదం అనడానికి నేను సాహసించను.

కామేశ్వరరావు said...

క్రాంతి, మహేష్ గారి "కామెంట్లు" చదివాక, నేను చెప్పదలచుకొన్న దాంట్లో కొంత అస్పష్టత ఉందనిపించింది. నేను "ఇంగ్లీషు పదాలే లేకుండా" తెలుగు మాట్లాడలని అనలేదు. తెలుగులో అందరికీ తెలుసున్న పదాలు ఉండీ, వాటికి ఇంగ్లీషుపదాలు వాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాను. నేను పట్టిన వ్రతం కూడా అలాటి పదాల విషయంలోనే.
ఉదాహరణకి "కామెంటు"కి తెలుగు పదం ఒకటి ఆలోచించి రాయవచ్చు. అలానే "ఫేషన్" అన్న పదానికి కూడా. అయితే అవి మనకి పరిచయమయ్యింది ఇంగ్లీషులోనే కాబట్టి దానికి తెలుగు పదం ఉపయోగిస్తే ఎక్కువమందికి అర్థం కాకపోవచ్చు. నేనన్నది అలాటి పదాల గురించి కాదు.
మరి ఇది ఎందుకు అతివాదమో, తెలుగుభాషలో చక్కని పదాలుండీ వాటికి ఇంగ్లీషుపదాలని వాడడం ఒక సామాజిక అవసరమని ఎందుకంటారో మహేష్ గారు వివరిస్తే బావుంటుంది.
నా అభిప్రాయాలని ఇవతలవాళ్ళ మీద రుద్దే ఉద్దేశం నాకేమాత్రం లేదు. నా ఆలోచనలని నలుగురితో చర్చించి, అందులో తప్పొప్పులు గ్రహించి అవసరమైతే మార్చుకోవాలనే నా ప్రయత్నం.

కొత్త పాళీ said...

చాలా బావుంది కామేశ్వర్రావుగారూ.

ఇటువంటి గురించి కనీ సం ఆలోచన చేసేవాళ్ళు మేధావులే కనక ఇక్కడ ఎవరి తెలివినీ, అవగాహనా శక్తినీ తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. భాష, వాడుక కొందరికి ఉద్యమ స్ఫూర్తి అయితే కొందరికి అది ఆలోచనలు పంచుకోవడానికి ఒక వంతెన మాత్రమే. ఉద్యమ ప్రాతిపదికగా భావించే వారిలోనూ ఏది ముందు, ఏది ముఖ్యం అనే విశేషాల్లో తేడాలున్నాయి మళ్ళీ. ఈ బ్లాగులూ, ఈ వేదికలూ మన అభిప్రయాల్ని పరస్పరం తెలియ జేసుకోడానికీ, తెలుసుకోవడానికీ. అబ్బే ఇది అనవసరం అని తీర్మానించేముందు అసలు ఈ ఆలోచనల్లో ప్రతిపాదనల్లో విలువ ఏముందో కొంచెం తరచి చూసుకోవాలి.

కొత్త పాళీ said...

అన్నట్టు ఇందాక ఒక తమాషా విషయం చెప్దామనుకుని మర్చిపోయాను. మా సాహితీ సమితి చర్చల్లో బాగా తీవ్ర వాదోపవాదాలే జరుగుతూ ఉంటాయి. మొదట్లో అందరూ శాంతంగా ఉన్నప్పుడు గుర్తు పెట్టుకుని మరీ ఎక్కడా ఇంగ్లీషు దొర్లకుండా తెలుగులో మాట్లాడ్డం మొదలెడతాము. చర్చ వేడెక్కే కొద్దీ ఆవేశం హెచ్చి తెలుగు చాటుకి తప్పుకుంటుంది. ఇలా ఒక అరగంట గడిచాక మా ఆరి సీతారమయ్యగారు మెల్లగా, ఏంటోనండీ ఇక్కడ అందరూ నాకర్ధం కాని ఏదో భాష మాత్లాడేసుకుంటున్నారూ .. అంటారు. దాంతో అందరమూ ఆవేశాలు కాస్త సర్ధుకుని మళ్ళి తెలుగు ని నాలికలమీద నర్తింపజేస్తాము కాసేపు. ఈ సీను సుమారు ప్రతి గంటకోసారి పునరావృతమఔతూ ఉంటుంది.

lalithag said...

మీ సందేశం బావుంది. మీ ఆలోచన ఇంకొంచెం మాకు అర్థం కావాలంటే మీరు ఏ ఆంగ్ల పదాల స్థానే తెలుగు పదాలు వాడుతున్నారో ఇంకో టపాలో వివరంగా వివరిస్తే మేమూ సాధన చేసే అవకాశం ఉంటుంది కదా?
ఇక్కడ "నెనర్లు" వాడడం గురించి చెప్పారు. "కామెంటు" వాడకం సమర్థించారు. వ్యాఖ్య అనడం అంత కష్టం కాదేమో?

వికటకవి said...

కామేశ్వరరావుగారు,

మీతో చాలా వరకు ఏకీభవిస్తాను. కానీ మనం చిన్నప్పటి నుంచి మన ప్రమేయం లేకుండానే నేర్చుకున్న భాషలో అసంకల్పితంగానయినా లేదా అత్యధికుల వాడుక ద్వారా అయినా పలు పదాలు ఆంగ్లాధ్రం చేసేసాం. వాటిని సరిదిద్దుతూ కూచోవాల్సిన అవసరం కన్నా, "లైట్ తీస్కో" లాంటివి అరికడితే చాలని నా అభిప్రాయం. దీనిని సరి చేసుకోటానికి పట్టుపట్టి ఓ వ్రతంలా ఎవరికి వారు చేసుకునే వ్యవహారం కాదని నా అభిప్రాయం. కనీసం ఓ చిన్న గుంపుతో మొదలవ్వాల్సిందే.

అలానే కొన్ని పదాలకి తెలుగు సమానార్ధాలు ఉన్నా చెప్పనలవికాని ఇబ్బంది పలకటానికి. ఉదా: నెనర్లు. ఇతరుల సంగతి తెలియదు కానీ, నాకు ఆ పదం పలకాలంటే ఏదో తీర్చలేని అప్పు చేసినంత బాధగా ఉంటుంది.

రవి వైజాసత్య said...

మీతో నేనేకీభవిస్తాను..వీలైనంతగా తెలుగులో మాట్లాడటానికి ఒక ఘాట్టి నిర్ణయం చాలు..అదేం బ్రహ్మవిద్య కాదు. మధ్యలో ఆంగ్ల పదాలు చొప్పించడం చదువుకున్నవాళ్ళ లక్షణంగా చూడటం ఇప్పుడే కొత్తగా పుట్టినదేమీకాదు..యాభైయేళ్ళ క్రితం నుండే ఇలాంటి ధోరణి ఉందని తెలుస్తుంది.

రాఘవ said...

కామేశ్వర్రావుగారు, నారాయణస్వామిగారు మొదలైన పెద్దలు పైన చెప్పినవాటితో నేనూ ఏకీభవిస్తున్నాను. తెలుగులో లేని ఆంగ్లంలో ఉన్న భావనలకి ఆంగ్ల పదాలు వాడడంలో తెలుగుకి ద్రోహం చేసినట్టు కాదు. కానీ తెలిసీ తెలుగు పదాలు వాడకపోవడాన్ని మాత్రం నేను సమర్థించలేను.
వికటకవీశా, నాకు కూడా "నెనర్లు" అనాలంటే అదోలా ఉంటుంది. అందుకే నేనా పదాన్ని వాడకుండా దాని ఇతర సమానార్థకాలతో పని కానిచ్చేస్తాను.

కామేశ్వరరావు said...

ఇప్పటివరకూ అభిప్రాయాలని తెలిపిన వాళ్ళందరికీ నెనరులు.
@లలితగారు, "కామెంటు"కి వ్యాఖ్య అన్న మంచిపదం నాకు తట్టలేదు! నేనా పదం ఉదహరించడంలో నా ఉద్దేశం, మనం రోజువారీ సంభాషణలో అది భాగం కాదని చెప్పడానికే. అలా అని దానికి మంచి తెలుగుపదం తడితే వాడక్కరలేదని నా ఉద్దేశం కాదు. మీరన్నట్టు దీని గురించి మరింత స్పష్టంగా మరో టపా రాస్తాను.
రవిగారు మంచి ప్రశ్నలు వేసారు. వాటి గురించి కూడా నా తర్వాతి టపాలో వివరించడానికి ప్రయత్నిస్తాను.
@వికటకవిగారు, మీరన్న "గుంపుతో మొదలుపెట్టడం" గురించి మీ ఆలోచనలు మరికాస్త వివరిస్తే బావుంటుంది.
@మహేష్ గారూ, మీరు ఏ విషయాన్నైనా కొత్తకోణంలోంచి విశ్లేషిస్తారని మీ బ్లాగులు చూస్తే తెలుస్తుంది. కాబట్టి మీ వివరణ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

gireesh.mca@gmail.com said...

ఎప్పటికీ నేను ఇలాంటి టపా ఒక్కటయినా చూస్తానని అనుకోలేదు. ఒకరు ప్రారంభించారు. అందరూ అనుసరిస్తారు... ఇది మొదలు, ఇది నిజం.

తెలుగులోనే మాట్లాడడం ప్రారంభించాను. మా ఇంట్లో వాళ్ళు కూడ ముందు నవ్వినా తర్వాత వారుకూడా తెలుగులోనే మాట్లాడడం మొదలు పెట్టారు

జయం నిశ్చయం

Srinivas said...

మనకు తెలిసిన తేలికపాటి తెలుగుపదాల బదులు ఇంగ్లీషు మాటలు వాడటం ఎందుకు అనడం అతివాదమెలాగయిందో నాకూ అర్థం కాలేదు. మనం పనిగట్టుకుని కొత్తగా ఈ మాటలు నేర్చుకోనక్కరలేదు. మనం ఇంతకుముందు వాడుతూ ఉన్నవే గద! ఒక వాక్యంలో తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదాలు ఎక్కువయినప్పుడు ఏకంగా ఇంగ్లీష్ లోనే మాట్లాడొచ్చు గద? last month Prasad weddingకి వెళ్ళినప్పుడు మాbrotherకి cash ఇచ్చాను అనడం కంటే "పోయన నెల ప్రసాద్ పెళ్ళికి వెళ్ళినప్పుడు మా అన్నయ్యకి డబ్బు ఇచ్చాను" అంటే మెరుగ్గా వినపడదా? మనకు తెలిసిన మాటల్ని ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు "మామూలు" అనే పదమే మామూలుగా వినపడదెందుకు? (commonగా)

ఆశ్చర్యం ఏమిటంటే ఇంగ్లీష్ మాట్లాడేప్పుడు ఒక్క తెలుగు మాట దొర్లినా అదో పెద్ద జోకయినట్టు నవ్వుకుంటాము.

మనం వాడగలిగీ వాడని కొన్ని పదాలు -
సమయం, కాలానికి సంబంధించినవి: రాత్రి, పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, మొన్న, నిన్న, నెల, ఏడాది వగైరా

అంకెలు: ఒకటి, రెండు వరసగా..

ఊత పదాలు: మరి, ఇంకా (So, and బదులు)

వరసలు: అమ్మ, నాన, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అత్త, మామ

కొంచెం ఆలోచిస్తే ఇలాంటి పదాలు బోలెడు.

Rajendra Devarapalli said...

(లేడికి)కాళ్ళు లేక కాదు,కాలంకలసి రాక (వేటగాడికి) చిక్కిందని ఒక సామెత.అలాగే మీకు ఈ విషయములో అనుమానాలుండి ఇలా ప్రశ్నించారా అని నాకొక అనుమానం:).రారా(రాచమల్లు రామచంద్రారెడ్డి)తన అనువాదసమస్యలు అన్న పుస్తకములో,తాను ఒకరోజు కొద్దిసేపటిలో ఎంతమంది "టైమెంతయ్యిందీ" అని అడిగినసంగతి సదరు పుస్తకరచనకు పురికొల్పిందీ వివరిస్తారు.అలాగే మా గురువుగారు దివంగత బూదరాజు రాధాకృష్ణ సంపాదకత్వంలో,తెలుగు అకాడమీ వారు వెలువరించిన మాండలికాలు అన్నప్రచురణలనోమాటు చూడండి,అప్పటికే సామాన్యజనాభా నిత్యజీవితవ్యవహారాలలో ఆంగ్లం ఎంతగా మమేకమైపోయిందో!
తెలుగులో సమానార్ధకాలుండీ ఆంగ్లపదాలు ఎందుకు వాడాలీ అన్నది మీ ప్రశ్న.అసలు ఆమాటకొస్తే ఆంగ్లానికొక్కదానికే అనుమతి మీరు ఎందుకు నిరాకరిస్తునారో నాకు అంతుబట్టటం లేదు.పాళీ,పైశాచి,సంస్కృత,అరవ,కన్నడ,మరాఠీ,ఒరియా, ఫ్రెంచి,పోర్చుగీసు,డచ్చి,లాటిన్,గ్రీకు ఇంకా చప్పన్నారు భాషా పదాలు కలసిపోయి,కలగాపులగమైన తెలుగులోనుంచి ఒక్క ఇంగ్లీషును మాత్రం ఎందుకు వెలివేయాలంటున్నారో?ఆమాటకొస్తే ఆయాపరాయిపదాలకు మనకు స్వంతమాటలు లేకా?వాడలేకనా?
మాఊరునుంచి బస్సులో తెనాలి వెళ్ళాలంటే బోలెడు వయాలున్నాయి,వయా ఇంటూరు,వయా బోడపాడు,వయా మోపర్రు,వయా చుండూరు,వయా నారాకోడూరు,ప్రతిగ్రామీణుడూ ఈ వయా పదాన్ని చాలా యధాలాపంగా వాడుతూనే ఉంటారు.కానీ ఇది తెలుగుమాటా??
డిక్షనరీ డాట్.కాం వారు ఇలా తెలియజేస్తునారు,vi·a (vī'ə, vē'ə)
By way of: went to Pittsburgh via Philadelphia.
By means of: sent the letter via airmail.
[Latin viā, ablative of via, road; see wegh- in Indo-European roots.]

మీరన్నట్లు అచ్చతెలుగు ప్రయోగం చాలాకాలం క్రితం విజయనగరంలొ జరిగింది.ఆదిభట్ల నారాయణదాసు అచ్చతెలుగులో చాలా రచనలు చేసారు.ఆయన దేవుడిని ఎల్లడు,గ్రంధాలయాన్ని పొత్తపుగుడి అని ఇలా రాసుకొచ్చారు.ఆయన హరికధకు ఇచ్చిన మన్ననలో కనీసం వెయ్యోవంతూ ఆఅచ్చతెలుగు పదాలకూ,ప్రయోగాలకూ దక్కలేదు.కారణం సామాన్యవాడుకకు బహుదూరంగా ఉండటమొకటని నా భావన.
అలాగే చాలాఅర్ధంపర్ధం లేని నియమనిబంధనలకు లోబడి చేసే సాహిత్య అకాడమీ వారి తెలుగు అనువాదాల్లో అంతా తెలుగే ఉంటుంది,కానీ ఆత్మ ఉండదు,మీరు గమనించి ఉంటారు.వీలయినంతవరకూ తెలుగు వాడాలనేది బాగుంది,కానీ అది తెలుగేనా అని ఎలా తెలుసుకోవటం అని నా అనుమానం.అస్తవ్యస్తం కన్నా గందరగోళం తెలుక్కి దగ్గరగా ఉంటుంది.కానీ మన పండితులు అస్తవ్యస్తాన్నే కోరుకుంటారు.ప్రభుత్వ అకాడమీలు,ఇతర సాహిత్యపరిషత్తులు తదితరపీఠాల్లో తిష్టవేసుక్కూచుని దశాబ్దాలపాటు కొందరు కుండలాల పండితులు(బూదరాజు గారి మాట)తెలుగును ఉద్ధరించారో,ఉప్పుపాతరేసారో మనకందరకూ తెలిసిందే.

మీరు ప్రవేశపెట్టిన ఈ చర్చ మరింతభాషావ్యాప్తికి దారి తీయాలని కోరుకుంటూ శెలవు

రానారె said...
This comment has been removed by the author.
రానారె said...

శ్రీనివాస్ గారు చెప్పినట్టు - వారాలు, నెలలు, అంకెలు, దగ్గరి బంధుత్వాలు - వీటిని తెలుగులో పలికితే చాలు. తెలుగులో మాట్లాడడంలో పెద్ద విజయం సాధించినట్లే. రెండేళ్ల క్రితం తెలుగుబ్లాగు గుంపులో చదువరిగారో చావాగారో గానీ ఈ సూచన చేశారు. నేను వాళ్లననుసరించాను. సులభంగానే నాకది వీలయింది. ఇప్పుడు నాకు సంతోషం కలిగించేదేమిటంటే కనీసం నాతో మాట్లాడేటప్పుడు నా మిత్రులు ఈ వీకెండు, సండే, మండే, లాస్టుమంతు, మా బ్రదరు లాంటి మాటల స్థానంలో తెలుగు పదాలను ఎబ్బెట్టుగా అనిపించకుండా హాయిగా పలుకుతున్నారు. ఇప్పుడు మనం తెలుగుబ్లాగు గుంపు, గుగుల్ గుంపు అనేస్తున్నాం. గ్రూపు అనడం లేదు. రెండేళ్ల ముందు 'గుంపు' అనాలంటే నాకు మనస్కరించక కనీసం 'బృందం' అనాలని మొండిపట్టు పట్టి నేనొక్కణ్ణే ఆ పదాన్ని వాడేవాణ్ణి. అందరూ గుంపు అనడానికే అలవాటు పడ్డాక నేనూ గోవిందయ్యనయ్యాను. చెప్పొచ్చేదేంటంటే వాడుతూ వుంటే పదాలు వాటంతట అవే సహజంగా మారతాయి. బస్సు, కారు, ట్రాక్టరు, రైలు లాంటి పదాలు సరే కానీ, శుభ్రంగా తెలుగులో వున్న పదాలను పోగొట్టుకోవడం ఎందుకు?

tlsbhaskar said...

Can I post comments in English?

Bhaskar

కామేశ్వరరావు said...

Sure:-)

oremuna said...

భాస్కర్ గారూ,

ఆంగ్లములో కూడా కామెంట్లు వ్రాయవచ్చు, మనకా స్వేచ్చ ఎప్పుడూ ఉంది. కాకుంటే తెలుగులో వ్రాస్తే ఎక్కువ మంది చదువుతారు నా బోటి బద్దకస్తులు కూడా తొందరగా చదవగలుగుతారు!