Monday, July 07, 2008

తెలుగువీర లేవరా!

"మనమూ, మనదీ" అనే భావనకి ఉన్న శక్తి మనందరికీ తెలుసు. అలాంటి ఏకతా భావాన్ని కలిగించే వాటిల్లో, భాష చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుందన్న విషయం కూడా మనందరికీ తెలిసున్నదే. ఈ రోజు ఇంటర్నెట్లో ఇంతమంది తెలుగువాళ్ళు ఇంత కొద్ది కాలంలో సన్నిహితులయ్యారంటే అది తెలుగుభాష చలవే కదా!
మరి అలాంటి మన భాష ఉనికిపై ఈనాడు సందేహాలు కలుగుతున్నాయంటే, "మన" ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందన్నమాటేగా. అయితే, దీనిగురించి ఆలోచించినప్పుడు, అసలు మన తెలుగు భాష నిజంగానే సమస్యల నెదుర్కొంటోందా, లేదా ఇదంతా మనం అనవసరంగా పడుతున్న కంగారా అన్న అనుమానం కలగకపోదు. వచ్చే పది సంవత్సరాల కాలంలో తెలుగు అంతరించిపోయేంత గడ్డుకాలం దాపురించిందని నేననుకోను. కానీ, ఇంకాస్త ముందుకి చూసి, నూరేళ్ళ తర్వాత తెలుగుభాషకి నూరేళ్ళునిండకుండా ఉంటాయా అని ప్రశ్నించుకుంటే, మన ధీమా కాస్త సడలకమానదు. గత ఏభైయేళ్ళుగా వచ్చిన మార్పులని గమనించినా, మన ప్రస్తుత పరిస్థితులని పరిశీలించినా, భాషల భవిష్యత్తుని శాస్త్రీయంగా అంచనా వేసే భాషావేత్తల పరిశోధనలని తరచిచూచినా తెలుగు భాష భవిష్యత్తు మరీ ఆశావహంగా కనిపించటం లేదు.
అసలీ సోదంతా ఎందుకండీ, మన తెలుగుభాషమీద అభిమానమున్న మనం, మన నిత్యవ్యవహారంలో ఎంత శాతం తెలుగువాడుతున్నామో (వాడగలుగుతున్నామో) ఒక్కసారి ఆలోచించండి! మనం రాసే "తెలుగు"బ్లాగుల్లో ఎంతగా ఇంగ్లీషు చొచ్చుకొస్తోందో గమనించండి! నేనంటున్నది, తెలుగులో లేని సాంకేతికపదాల గురించి కాదు. వాటి సంగతి తర్వాత, అసలు మన తెలుగుభాషలో ఉన్న పదాలే గబుక్కున గుర్తురాక ఇంగ్లీషు పదాలు ఎన్నిమార్లు వాడటం లేదు మనం! మన తెలుగుభాషకి సొంతమైన ఎన్ని జాతీయాలూ, ఎన్ని సామెతలూ ఈ రోజు మనం ఉపయోగిస్తున్నాం? ఇక మన పిల్లల సంగతి సరేసరి!
ఇదంతా ఎందుకిలా జరుగుతోంది? ఇది సహజ పరిణామమా? మనకి మన భాషమీద ద్వేషమేమీ లేదే! మరెందుకిలా? అని ఆలోచిస్తే, నాకనిపించిన విషయం - మనకి మన భాషమీద ద్వేషం లేకపోయినా, ఉండాల్సినంత మమకారం లేదేమోనని. మమకారం ఉన్నా, మరేవో శక్తులు ఆ మమకారాన్ని చంపేస్తున్నాయని. వాటిపై తిరుగుబాటు చేసి, మన ఉనికిని మనం కాపాడుకొనే అవసరం మనకుంది. మన తెలుగుభాషలో మనం ఆలోచించలేని నాడు, చక్కగా తెలుగుమాట్లాడలేని నాడు, అందంగా తెలుగు నుడికారాన్ని రాయలేని నాడు మనం తెలుగువాళ్ళగానే మిగలం. అలాంటి విపరీతం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే!
తెలుగుభాష పరిరక్షణకి ప్రభుత్వం కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది, నిజమే. కానీ ఆ అవసరం ప్రభుత్వానికి తెలిసినప్పుడే కదా అది సాధ్యమయ్యేది. ఆ అవసరం ప్రభుత్వానికి తెలిసేలా చెయ్యాల్సిందీ మనమే.

ఈ ఆలోచనలు నాలో చాలా కాలంనుంచీ గుడుసుళ్ళు తిరుగుతున్నాయి. ఈ నెల ఈమాటలో భద్రిరాజుగారి వ్యాసం "తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు" మరింత ప్రేరణనిచ్చింది. ఇలాటి ఉద్యమానికి ఇంటర్నెట్టులోనే నాంది పలకాలన్న ఆలోచన వచ్చింది. తెలుగుని అభిమానించే మన నెజ్జనులంతా పూనుకుంటే, ఇది మంచి ఫలితాలని సాధించగలదన్న నమ్మకమూ కలిగింది. ఎందుకంటే, ఇది "మన" (చదువుకొని పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ) సమస్య కాబట్టి. మనమే దీనికి సరయిన పరిష్కారం ఆలోచించగలం.
ఈ బ్లాగుని కేవలం నా సొంత అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే కాకుండా, మనందరం కలిసి ఆలోచించడానికీ, పనిచెయ్యడానికీ ఒక వేదికగా ఉండలన్న సంకల్పంతో మొదలుపెడుతున్నాను. ప్రత్యేకమైన ప్రణాలికంటూ ప్రస్తుతం ఏమీ లేదు. మీ సలహాలకోసం ఎదురుచూస్తాను.
ఈ బ్లాగుకి ఏం పేరుపెడదామా అని ఆలోచించినప్పుడు "తెలుగువీర లేవరా" అన్న శ్రీశ్రీ పాట చప్పున గుర్తొచ్చింది. ఆ పాటని మన తెలుగుభాష ప్రస్తుత పరిస్థితికి కూడా అన్వయించుకోవచ్చుననిపించింది. ఇదొక రకమైన విప్లవమే, తిరుగుబాటే. అయితే ఈ తిరుగుబాటు ఎవరో పరాయివాళ్ళ మీద కాదు, మనమీదే! మన తెలుగుభాషంటే మనలో పేరుకుపోతున్న నిర్లిప్తత, నిరాసక్తత, చులకన భావాల మీద. వాటిని కలగజేస్తున్న సాంఘిక పరిస్థితుల మీద.
ఇంకా ఎందుకు ఆలశ్యం?

తెలుగువీర లేవరా! దీక్షబూని సాగరా!
తెలుగుభాష మేలుకోరి తిరుగుబాటు చెయ్యరా!


గమనిక: మనమందరం చదువుకున్నవాళ్ళం విజ్ఞానవంతులం కాబట్టి, ఆవేశం కన్నా ఆలోచనకీ, ఉద్రేకం కన్నా ఉపాయానికీ ఎక్కువ విలువనివ్వాలని నా ఆకాంక్ష!

14 comments:

Subrahmanyam Mula said...

మంచి ఆలోచన! ముందుగా మీకు అభినందనలు.

భాషని ప్రేమించేవారు, భాష కోసం తీవ్రంగా తపించే వారు అడుగడుగునా మనకి ఎదురవుతారు. అయితే అందరినీ ఒకతాటి మీదకి రప్పించడం తక్షణ కర్తవ్యం. ఆ పనిని మీ బ్లాగు విజయవంతంగా నిర్వర్తిస్తుందని నా నమ్మకం.

వీవెన్ said...

భేష్!

చిలమకూరు విజయమోహన్ said...

మంచి ఆలోచన,చేయీచేయీ కలిస్తే అసాధ్యమేమీ కాదు.

Anil Dasari said...

మా ఇంటిదగ్గరో మహాతల్లి ఆవిడ ఏడాది పాపడినుద్దేశించి 'నా సన్ బర్ప్ తీశాడు', 'నాకేసి స్టేర్ చేశాడు' అంటుంది. ఈమె 'సన్' పెరిగి పెద్దయ్యాక అతని తెలుగెంత దివ్యంగా ఉండబోతుందో మరి. ఇంతకీ ఈవిడ తెలుగు మీడియం స్కూళ్లలో చదువుకునొచ్చిన అచ్చ తెలుగావిడ! తెలుగు ముందుగా ఇలాంటోళ్లకి నేర్పించాలేమో.

కొత్త పాళీ said...

మంచి ఆలోచనలు. ఒక విధంగా తెలుగు బ్లాగర్లందరూ అంతో ఇంతో ఈ ఆలోచనతోనే కార్యోన్ముఖు లవుతున్నారు.

@అబ్రకదబ్ర - మీ పక్కింటావిడకి మిగుల అభినందనలు. ఒకామె ఇక్కడ కథలు రాస్తుండేవారు, ఈ మధ్యనెక్కడ కనబట్టల్లేదు. కథల్లో వాక్యాలు ఇలా ఉంటాయి - పిల్లలకి మిల్క్ హీట్ చేసి సర్వ్ చేసే లోపలే అడల్ట్స్ కూడా డిన్నర్ కి వచ్చేశారు. ఏ చెప్తాం!

www.srinucartoons.blogspot.com said...

తేనెలొలుకు కమ్మనైన, తియ్యనైన తెలుగు భాష మనది. నిండుగ వెలుగు భాష మనది.

సిరిసిరిమువ్వ said...

మంచి ఆలోచన. అభినందనలు. చేయి చేయి కలిపితే చేయలేనిది ఏదీ ఉండదు. ముందు మన ఇంటి నుండి మన చుట్టుపక్కలవాళ్ళతో మొదలుపెడదాం.

Unknown said...

మన పరిధిలో ఏం చెయ్యగలమో తప్పకుండా ఆలోచిద్దాం.

Kathi Mahesh Kumar said...

మీ ఆశ,ఆశయం ముదావహం.

ఈ మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం ఆరవతరగతి నుండీ ఆంగ్లమాధ్యమంలో పాఠశాల విద్య మొదలుపెట్టడానికి నిర్ణయించిన నేపధ్యంలో, బ్లాగుల్లో తెలుగు భాష గురించి చాలా చర్చ జరిగింది.వాటిల్లో కొన్ని విలువైన అభిప్రాయాలైతే మరికొన్ని నిరర్థక వాదనలు.

మొదటగా ఇంతకు మునుపే బ్లాగుల్లో ఉన్న ఈ సమాచారాన్ని ఒకదగ్గర క్రోడీకరిస్తే బాగుంటుందని నా ఆలోచన.మీరు నడుంబిగించి ముందుసాగితే, నా వంతు సాయం చెయ్యడానికి నేను తయార్!

Bolloju Baba said...

మాస్టారు అనే బ్లాగులో చాలామంది ఈ తెలుగు భాషా భోధనపై కామెంట్లు ఉన్నాయి. గమనించగలరు.
బొల్లోజు బాబా

కామేశ్వరరావు said...

ప్రోత్సాహాన్ని తెలియజేసిన అందరికీ పేరు పేరునా నెనరులు.
మహేష్ కుమార్ గారు, బాబాగారు,
ఈ బ్లాగు మొదలుపెడదామనుకున్నప్పుడే, ఈ విషయమై బ్లాగుల్లో ఇంతవరకూ ఏమి వచ్చాయన్నది గూగులించాను. కేవలం తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి గురించిన టపాలే రమారమీ అరవై పైచిలుకే కనిపించాయి! ఇంకా చాలానే ఉంటాయి. వీటన్నిటినీ క్రోడీకరించడానికి ప్రయత్నిస్తున్నాను.
అంతర్జాల ప్రపంచంలో ఇంతమందికి భాషమీద ఇంత అభిమానం ఉండడం గమనించే, ఏదో కొంత చెయ్యగలమనే నమ్మకం కలిగింది. ఉన్న పువ్వులనన్నీ ఏరి ఒక పూలదండగా మార్చే ప్రయత్నమే ఇది!
కాబట్టి దీనిగురించి ఆలోచించిన వారందరూ, మీ మీ ఆలోచనలని ఇక్కడ కామెంట్ల ద్వారా పంచుకున్నా సరే. లేదా టపాలా రాసి నాకు పంపించినా (నా ఈమైలు: kamesh_b@yahoo.com) సరే, నేనిక్కడ పోస్టు చేస్తాను.
సాధ్యమైనంత వరకూ, తెలుగు భాష ప్రస్తుత పరిస్థితిపై ఊరికే వాపోవడం కాకుండా, సమస్య మూలాలని విశ్లేషిస్తూ, ఆచరణయోగ్యమైన పరిష్కారాలను సూచిస్తూ రాస్తే బావుంటుందని మనవి.

Varttik said...

ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తూ కంచా ఇల్లయ్య డక్కన్ హెరాల్డ్ లో రాసిన వ్యాసం లో లేవనెత్తిన అంశాలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందనుకుంటాను. ఆ వ్యాసం ఇక్కడ చదవవచ్చు:
Tryst with English medium

కామేశ్వరరావు said...

వార్తిక్ గారు,
ఈ విషయాన్నిగురించి ప్రస్తావించినందుకు నెనరులు. దీనిగురించి నా ఆలోచనలు మరో టపాలో పెడతాను.

Unknown said...

భైరవభట్ల కామేశ్వర రావు గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.