Thursday, December 11, 2008

చెన్నయిలో ఎవరైనా బ్లాగ్వీరులు ఉన్నారా?

సింగార చెన్నయిలో (లేక ఆ చుట్టుపక్కలో) ఉన్న తెలుగు బ్లాగర్లకి (అసలెవరైనా ఉన్నారా?) విజ్ఞప్తి.
ఈ ఆదివారం (14-Dec-08) తెలుగు బ్లాగుల దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. ఆ సందర్భంగా మనమందరమూ కలుసుకుంటే బావుంటుంది. ఉత్సాహవంతులు, ఇక్కడ కామెంటడం కాని, నాకు ఈమైలు (kamesh_b@yahoo.com) పంపడం కాని చెయ్యవచ్చు.
ఎవరు, ఎంతమంది ఉన్నారన్న దాన్నిబట్టి ఎప్పుడు, ఎక్కడ అన్నది నిర్ణయించుకోవచ్చు.
కలుసుకుందామా మరి!
పూర్తిగా చదవండి...

Thursday, September 18, 2008

వట్టి మాటలు కట్టి పెట్టోయ్! గట్టి మేల్ తలపెట్టవోయ్!


ఈ మధ్య సుజాతగారి బ్లాగులో "తెలుగంటే అంత అలుసా" అన్న టపా ఇచ్చిన స్ఫూర్తి ఇది. తెలుగు భాషమీద మమకారం చాలామందిలో ఉందన్న నమ్మకం అక్కడి వ్యాఖ్యలవల్ల కలిగింది. దీనిగురించి మనమేమైనా ఎందుకు చెయ్యకూడదూ అన్న మురళిగారి ఆలోచనకి కార్యరూపం ఇవ్వాలన్న ఉత్సాహం కలిగింది.

నిజానికి తెలుగుభాషేమీ చనిపోలేదు దాన్ని పునరుద్ధరించడానికి. పరిరక్షించుకోవాల్సినంత దీనస్థితిలో ఉందని కూడా అనలేం. కానీ దీనిగురించి మరికాస్త విస్తృత ప్రచారం అవసరం అని మాత్రం అనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగునాట తెలుగు మాట్లాడాల్సిన అవసరమూ, అందులోని ఆనందమూ ప్రతి తెలుగువాడికి తెలియాలనుకోవడం అత్యాశ కాదు కదా.

మన భాషమీద మనం అభిమానం చూపించడానికి:

ఇతర భాషలని కించపరచాల్సిన అవసరం లేదు
ద్వేషించాల్సిన అవసరం లేదు
విసర్జించాల్సిన అవసరం కూడా లేదు.

మన భాషని మనవాళ్ళతో మనం చక్కగా, హాయిగా మాట్లాడుకుంటే చాలు.
మన భాషలోని తీయదనాన్ని మనం రుచిచూస్తే చాలు.
మన భాషని మన పిల్లలకి అందిస్తే చాలు.

అంతర్జాలంలో తెలుగు మీద అభిమానం పుష్కలంగా కనిపిస్తోంది. కానీ ఎంత శాతం తెలుగువాళ్ళు అంతర్జాలంలో ఉన్నారు? చాలా తక్కువే కదా. మరి మన అభిమానాన్నీ మన ఆనందాన్నీ మిగతా తెలుగువాళ్ళతో ఎందుకు పంచుకో కూడదూ?
ఈ ఆలోచనకి కార్యరూపం ఇచ్చే ప్రయత్నమే "తెలుగు భాషా ప్రచార సమితి" అన్న గూగులు గుంపు.
తెలుగునాట తెలుగు ప్రచారాన్ని గురించి మరింత చర్చించి, ఒక కార్యాచరణ విధానాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అమలుపరచాలన్నది ఈ గుంపు ఆకాంక్ష.
మరి ఆ కాంక్ష మీకూ ఉంటే ఆలస్యం చెయ్యకుండా చేయికలపండి.
వట్టి మాటలు కట్టి పెట్టోయ్! గట్టి మేల్ తలపెట్టవోయ్!
పూర్తిగా చదవండి...

Friday, August 29, 2008

తెలుగు భాషాదినోత్సవం!

తెలుగుభాష అంటే అపారమైన అభిమానం, అఖండమైన పాండిత్యం మూర్తీభవించిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులుగారు. భాషమీదున్న అభిమానంతో దానికోసం ఒక వ్యక్తి తన జీవితాన్నే ధారపోసాడన్న విషయం తలచుకొన్నప్పుడల్లా ఒక ఆశ్చర్యం, ఒక పులకింత! ఈ
రోజు అతని పుట్టినరోజుని మనం తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం, స్ఫూర్తిదాయకం. గిడుగువారు వ్యావహారిక భాషా వ్యాప్తికి చేసిన కృషి అనన్య సామాన్యమైనది. అతని గురించి తెలుసుకోవడం ప్రతి తెలుగువాడి కర్తవ్యం.

19వ శతాబ్దానికి పూర్వం తెలుగుసాహిత్యంలో పద్య కావ్యాలే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వచన సాహిత్యం, ఇతర శాస్త్రాలకి సంబంధించిన వచన గ్రంధాలూ ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందలేదు. పందొమ్మిదవ శతాబ్దంలో, మారుతున్న సాంఘిక పరిస్థితులూ, పాశ్చాత్యులతో సంబంధాలూ, అచ్చు యంత్రం అందుబాటులోకి రావడం మొదలైన అనేక కారణాల వల్ల సాహిత్యంలో కొత్త ప్రక్రియలకు వ్యాప్తి వచ్చింది. ఈ నేపథ్యంలో, విస్తృతి చెందుతున్న యీ సాహిత్య, సాహిత్యేతర గ్రంధాలలో వాడే భాష గురించి ఆలోచన మొదలయ్యింది. గ్రాంధికభాషా వాదులు (అప్పట్లో చాలామంది పండితులు), మన కావ్యాలలో ఉన్న భాషనే వ్యాకరణ బద్ధం చేసి, దానినే అన్ని రకాల రచనలకీ వాడలని సంకల్పించారు, పట్టుబట్టారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో ముఖ్యులు గిడుగు రామ్మూర్తిగారు. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికీ, వచన రచనకీ కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన "శిష్టవ్యావహారిక" భాషనే వాడాలనీ, గ్రాంధికవాదులతో అవిశ్రాంతంగా, హోరాహోరి యుద్ధం చేసారు. తన ఆశయసాధన కోసం బతుకంతా శ్రమించారు.
గిడుగువారిలో నాకన్నిటికన్నా నచ్చే విసయం ఏవిటంటే, అతను వట్టి గాలికబుర్లు చెప్పలేదు. ఉత్తుత్తి వాదనలు చెయ్యలేదు. తెలుగు సాహిత్యాన్నంతటినీ క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి, ప్రాచీన సాహిత్యంలో ఉన్న వచన రచనలు ఏ రకంగా అప్పటి వాడుకభాషకి దగ్గరగా ఉన్నాయో, కావ్యాలలో కూడా వ్యాకరణానికి లొంగని ప్రయోగాలెన్ని ఉన్నాయో నిరూపించి చూపించారు.
ఊరూరా తిరిగి, సభలు జరిపి, పండితులతో చర్చలు చేసి, వ్యావహారిక భాషా ప్రయోజనాన్ని ప్రచారం చేసారు.
చెప్పిన దాన్ని సశాస్త్రీయంగా చెప్పడం ఇతని గొప్పతనం. పండితులైన ఎందరో గ్రాంధికభాషా వాదులు ఇతని ప్రతిభకి ముగ్ధులై అతన్ని గౌరవించారు. తమ ఆలోచనలని కూడా మార్చుకున్నారు. ఇతరులు చెప్పేదాని గురించి ఆలోచించి, అందులో మంచిని గ్రహించడమే కదా గొప్పవాళ్ళ లక్షణం!
అతన్ని గౌరవించిన వారిలో తిరుపతి వేంకట కవులు ప్రముఖులు. తమ దోవని మార్చుకున్నవారిలో ప్రముఖులు కందుకూరి వీరేశలింగం, తాపీ ధర్మారావు.
గిడుగువారు సవరభాషమీద కూడా ఎంతో పరిశోధన చేసారు. సవరభాషకి నిఘంటువు వ్యాకరణం సమకూర్చారు. సవరల విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసారు.
గిడుగువారి వ్యక్తిత్వంలో మరి కొన్ని అంశాలు - అతని పట్టుదల దృఢ దీక్ష, ముక్కుసూటి నడవడిక, సాంఘిక సంస్కరణాభిలాష, ఆంధ్ర దేశాభిమానం.
అతని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం!

గిడుగువారి గురించి భద్రిరాజుగారి పరిచయం ఇక్కడ చదవొచ్చు:
గిడుగు వెంకట రామమూర్తి - రేఖాచిత్రం (1863 - 1940)

గిడుగువారు రాసిన కొన్ని వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు:
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక

పూర్తిగా చదవండి...

Monday, August 18, 2008

మనలని అంతర్లీనంగా కలిపే సూత్రం ఏది?

మొన్న బ్లాగాడించే రవిగారు "దేశభక్తి అంటే ఏమిటి?" అని చురుగ్గా ఓ ప్రశ్న వేసారు, స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా. అయితే అందులో, అదేవిటో తెలుసుకొనే ఆలోచనలకన్నా, అది శుద్ధ దండుగమారి ఆవేశమేనా అనే ఒక భావన లీలగా కనిపించింది. దానికి నేనక్కడ నాకు తోచిన నాలుగుముక్కలు కామెంటేను. కానీ అసలు ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. "దేశభక్తి అంటే ఏమిటి?"

దేశభక్తి అనగానే నాకు తెలుగులో రెండు గొప్ప గీతాలు, రెండూ దేశభక్తి గీతాలే, గుర్తుకొస్తాయి. ఒకటి గురజాడ "దేశమును ప్రేమించుమన్నా", మరొకటి దేవులపల్లి "జయ జయ ప్రియభారత జనయిత్రి". ఈ రెంటినీ ఒకే దేశభక్తి కవిత్వపు గాటకి కట్టేసే విమర్శకాగ్రేసరులున్నారు. కానీ అది సరికాదు. గురజాడది అభ్యుదయంతో కూడిన దేశభక్తి అయితే, దేవులపల్లిది కాల్పనిక భావావేశంతో కూడుకొన్న దేశభక్తి. నన్నడిగితే ఈ రెండూ మనకి అవసరమే! ఒకటి స్ఫూర్తినిస్తే మరొకటి కార్య నిర్దేశం చేస్తుంది.
"దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్!" అని చాలా స్పష్టంగా దేశభక్తిని నిర్వచించాడు గురజాడ. కేవలం భౌగోళికమైన సరిహద్దుల (Geographical boundaries) దృష్ట్యా మనం మన దేశమ్మీద అభిమానం పెంచుకోవడం నిరర్ధకం. అది కృతకమైన దేశభక్తి. "మనది" అనే ఒక భావన మన దేశప్రజలనందరినీ కలిపితే, దాని ద్వారా మనకి మనవాళ్ళపైన కలిగే ప్రేమా అభిమానం నిజమైన దేశభక్తి అని నా ఉద్దేశం. ఆ "మనది" అనే భావన ఎక్కడనుంచి వస్తుంది? మనలని అంతర్లీనంగా కలిపే ఆ సూత్రం ఏది? ఈ ప్రశ్నలకి నాకు తోచిన జవాబు భారతీయమైన సంస్కృతి. దేశభక్తి అనే కన్నా జాతీయత దీనికి సరైన పదం అనుకుంటా.

ఇంతకీ ఈ సోదంతా ఇక్కడెందుకు రాస్తున్నాను? ఆ మధ్య చర్చల్లో కత్తి మహేష్ గారన్నారు, తెలుగు సంస్కృతి మారిపోతూ ఉంటే దానికనుగుణంగానే తెలుగుభాష మారుతోంది. కాబట్టి తెలుగుభాషని మాత్రమే ఉద్ధరిద్దామనుకుంటే అయ్యే పని కాదూ అని. సంస్కృతీ భాషల మధ్య సంబంధం గురించి వారన్నది ముమ్మాటికీ నిజమే. అందుకే భాష గురించి ఆలోచించేటప్పుడు సంస్కృతిగురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనిపించింది.
సంస్కృతి అంటే పండగలూ పబ్బాలూ, పూజలూ పునస్కారాలే కాదు. సంస్కృతి అంటే మనదైన జీవన విధానం, విలువలు, దృక్పథం. ఇవన్నీ మనకంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు అనిపించకపోయినా, కాలం మనకి దీని ప్రాముఖ్యాన్ని గుర్తుచెయ్యక మానదు. మన అస్తిత్వం ఏవిటి, మనం ఎవరం అనే ప్రశ్న, ఒక జాతిగా మన తెలుగువాళ్ళం, మన భారతీయులం వేసుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికైనా వస్తుంది. అప్పుడు మనల్ని మనం సాంస్కృతికంగా పునరావలోకనం చేసుకొని, మనది అన్నదాన్ని స్థాపించుకొని, పునరుజ్జీవులం కావల్సిన అగత్యం ఏరపడుతుంది. సాంస్కృతిక పునరుజ్జీవనం (Cultural Renaissance) అంటే వెయ్యేళ్ళు వెనక్కి వెళ్ళడం కాదు. పాతనంతా మళ్ళీ నెత్తికెత్తుకోవడమూ కాదు. మన మూలాలని మనం స్పష్టంగా తెలుసుకొని, దాని ఆధారంగా మనకే స్వంతమైన ఒక కొత్త సంస్కృతిని సృష్టించుకోవడం.

మన భారతీయ సంస్కృతిలో నాకు కనిపించే, మనం నిలబెట్టుకోవాలనిపించే, మౌలిక లక్షణాలు నాలుగు:

1. శ్రామికత - శారీరికమైన శ్రమకి మన సంస్కృతి విలువనిస్తుంది. శారీరక సౌఖ్యమే ప్రధానమనే భావన మనది కాదు. మానసిక ఆనందం మనకి ముఖ్యం. కానీ ఇప్పుడు శారీరిక సుఖమే పరమావధి అనే భావానికి మనం లొంగిపోతున్నాం. నడక దూరంలో ఉన్నదానికైనా మోటారు బళ్ళమీదే వెళుతూ, ఆరోగ్యంకోసం ప్రత్యేకంగా ముక్కుతూ మూలుగుతూ "morning walk" చేసే పరిస్థితి ఎవరికీ హాస్యాస్పదం అనిపించటం లేదు! మానసిక"అవసరాలు" "లగ్జరీ"లవుతున్నాయి. శారీరకంగా కష్టపడుతున్నా, మానసికంగా సంతృప్తితో ఆనందంతో ఉండేవాళ్ళని చూసి, వాళ్ళ ఆనందం వట్టి భ్రమ అని ఈసడించుకొనే ఒక విపరీత ధోరణి మనకి అలవాటవుతోంది. దీన్నుంచి బయటపడాలి.

2. ప్రకృతితో చెలిమి - ప్రకృతితో అతి సన్నిహితంగా జీవితాన్ని గడపడం మన సంస్కృతిలో ఒక ముఖ్యభాగం. మన వేషభాషలూ, ఆహారవ్యవహారాలూ, ఆచారాలూ అన్నీ ప్రకృతితో ముడిపడ్డవే. దీనికీ మనం దూరమైపోతున్నాం.

3. ధార్మికత - మన దేశంలో మూఢాచారాలూ, దురాచారాలూ ఉండిన మాట వాస్తవమే. వాటిని నిర్మూలించుకోవడం చాలా అవసరమేనూ. కానీ, వాటిని మనం భూతద్దంలో చూస్తూ, మన సంస్కృతి అంటే ఆ దురాచారాలు తప్పిస్తే మరేమీ లేదూ అనుకోవడానికి అలవాటుపడుతున్నాం. అది చాలా దురదృష్టకరం. మనిషిని మనిషి ప్రేమించాలని చెప్పే మానవత్వం, ఇతరులకి ఉపకారం చెయ్యాలని ప్రబోధించే నీతి ధర్మ సూత్రాలెన్నో మన సంస్కృతిలో అంతర్భాగమై, మన భారతీయుల జీవితాలని నడిపించాయి. కేవల వ్యాపారాత్మక దృష్టి ప్రబలి మనమీ మౌలిక సూత్రానికి దూరమవుతున్నాం.

4. గ్రహణ/సహన శక్తి - ఇంగ్లీషులో దీన్ని "Open mind and Tolerance" అని అనవచ్చు. ఇందులో భారతీయులకి మించినవాళ్ళే లేరేమొ! ఇది మన బలహీనతకాదు, శక్తి అని మనం గుర్తించాలి.

మన సంస్కృతిలో భాగం కానిదీ, మనం పాశ్చాత్యులనుండి నేర్చుకోవలసిందీ వైజ్ఞానికత (వైజ్ఞానిక దృష్టి). ఈ అయిదింటి కలయికతో మనదైన సంస్కృతిని మనం సృష్టించుకోవాలి. అలా చేసినప్పుడు మనకంటూ ఒక విశిష్టమైన అస్తిత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ప్రపంచానికీ, మానవజాతికీ మనదంటూ ఒక ప్రత్యేకమైన contribution (దీనికి సరైన తెలుగుపదం నాకు తట్టడం లేదు) ఇచ్చినవాళ్ళమవుతాం.
"నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించానూ" అని గర్వంగా పాడుకోగలుగుతాం!

పూర్తిగా చదవండి...

Wednesday, August 13, 2008

నేనెరిగిన తెలుగుదనం

ఎఱ్ఱంచు పంచెకట్టూ, పైన లాల్చీ, నుదుటన నిలువుగా తీర్చిన తిలకంతో పక్కన నడుస్తున్న తాతగారు, తన స్వగతాలని వినిపిస్తూంటే వింటూ, చెఱకు చేలమ్మటా, జీడితోటల్లోనూ తిరగడం...
తేగలు కాల్చుకు తినడం, తాటికాయలు చేతివేళ్ళతో జుఱ్ఱుకోడం, నవనవలాడే పనసకాయలు చిన్నాన్నలు కసకసకసా కొట్టి చేసిన సన్నని పొట్టుతో తయారైన పనసపొట్టు కూర వాసనా రుచీ ఒకేసారి తలకెక్కడం...ఇలా ఎన్నో...
చిన్నప్పుడు, అప్పుడప్పుడు, వేసవి సెలవల్లో అందీ అందక నాకందిన తెలుగుదనం!

నాన్న వినిపించిన రాయబారప్పద్యాలూ, అమ్మ నేర్పిన తెలుగు పాఠాలు, అమ్మమ్మ వల్లెవేయించిన శ్లోకాలూ, తాతతో కలిసి నింపిన "బాలజ్యోతి", "వనిత" గళ్ళ నుడికట్లూ...
మూడుకోవిళ్ళలోనో, గుంచీలోనో జరిగే హరికథలకి వెళ్ళడం, ఇంట్లో ఉన్న పాత చిడతలని పట్టుకొని పెద్ద హరిదాసులా "గజేంద్రమోక్షం" హరికథ వచ్చీరాని భాషలో చెప్పి అందరినీ మురిపించడం, వినాయకచవితి ఉదయాన్నే లేచి పత్రికోసం వేటా, భోగీ వచ్చిందంటే పెరట్లో ఏ చెట్టుకొమ్మల్ని విరపాలో, ఏ పాత కుర్చీలకి ఉద్వాసన చేప్పాలో పెద్దవాళ్ళతో గొడవా, దీపావళికి జువ్వల యుద్ధాలూ...ఇలా ఎన్నెన్నో...
పెద్దవుతూ నే ననుభవించిన తెలుగుదనం!

తెలుగు నేలమీద, తెలుగువాళ్ళ మధ్యలో, తెలుగు మాట్లాడుతూ, తెలుగువాడిలా బతికే ఆనందం...
నాకు దూరమైన తెలుగుదనం!

మీగడ అద్దుకు తినే ఆవకాయన్నం, ఉల్లిపాయి నంచుకుతినే గోంగూరా కందిగుండా, వెల్లుల్లితో ఘుమ్మెత్తించే పాఠోళీ, నిమ్మకాయ జల్లుకొని మధ్య మధ్య పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ తినే పసందైన పెసరపప్పూ...
ఇంకా నా జీవితంలో (మా ఆవిడ ధర్మవా అని) మిగిలున్న తెలుగుదనం!

"నాన్నా, పులి అంటే లయనా టైగరా?"
నేను జీర్ణించుకోలేకపోతున్న తెలుగుదనం :-(

పూర్తిగా చదవండి...

Friday, August 01, 2008

మనకెప్పుడీ మంచి రోజులు?

Effective expression possible only in mother tongue

మన మంత్రులెవరైనా ఈ మధ్యకాలంలో ఇలా మాట్లాడారా? ఎందుకు లేదు? దానికెవరు బాధ్యులు?
మనం మన తమిళ తముళ్ళనించి ఎందుకు నేర్చుకోకూడదు? వాళ్ళది అహంకారమని కొట్టిపారేస్తే అది మనకి సంతృప్తి. ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్యనున్న గీత సన్ననిదే. కానీ ఆత్మగౌరవానికీ, ఆత్మన్యూనతకీ మధ్యనున్న గీత చాలా లావైనదే కదా! నిజానికి మనని మనం తక్కువచేసుకోడం ఒక ఫేషనయిపోయింది. తెలుగువాడు తలచుకుంటే చెయ్యలేనిది లేదు. ఎటొచ్చీ అంతా ఆ తలచుకోడంలోనే ఉంది!
అంతర్లీనంగా మనకి మనమీద చాలా అభిమానమే ఉంది. అంతర్జాలంలో ఇన్ని తెలుగు బ్లాగులు ఇంతగా నడుస్తున్నాయంటే, దానికి కారణం మరేమిటి?
అంతర్జాలంలో ఇంతమందికున్న ఈ తెలుగు భాషాభిమానాన్ని మనం మన రాష్ట్రంలో ప్రజలదగ్గరకి ఎందుకు తీసుకువెళ్ళ కూడాదూ అన్నారు, ఈ మధ్యనే ఒక బ్లాగ్మిత్రుడు.
అది చాలా మంచి ఆలోచన. మరి మీరేమంటారు?
పూర్తిగా చదవండి...

Monday, July 28, 2008

ఆంగ్లమాధ్యమం - అనవసర వివాదం

పాఠశాలల్లో ఇంగ్లీషుమాధ్యమం గురించి చాలా తర్జనభర్జనలు జరిగాయి, జరుగుతున్నాయి. వార్తిక్ గారు కంచా ఐలయ్యగారి వ్యాసాన్ని ప్రస్తావించి, అతని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నాన్నారు.
దాని గురించి నా ఆలోచనలివి:

1. ప్రాథమిక విద్యాభ్యాసం (ఆరవ తరగతి వరకూ) మాతృభాషలో జరిగితేనే పిల్లలకి చక్కగా చదువు ఒంటబడుతుందని భాషా శాస్త్రజ్ఞులూ మనోవైజ్ఞానికులూ తేల్చిచెప్పినా, దాన్ని ఒప్పుకోమూ అనడం మన మూర్ఖత్వమే అవుతుంది.

2. ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగుభాషాలో జరిగితే తెలుగుభాషకి మేలు జరుగుతుందనడంలో కూడా సందేహమేమీ లేదు. అంటే దీనివల్ల ఇటు పిల్లలకీ, అటు భాషకీ కూడా మంచే జరుగుతుందన్నమాట.

3. అయితే, ప్రస్తుత పరిస్థితులలో అది ఎంతవరకూ సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుందీ అన్నది ఆలోచించాల్సిన విషయం. హఠాత్తుగా వచ్చే ఏడాదినుంచీ దీన్ని అమలుపరిచేద్దాం అంటే జరిగే పని కాదు. అలానే, మీ పిల్లలని ఇంగ్లీషుమీడియం స్కూళ్ళలో చేర్పించవద్దని తెలుగుభాషాభిమానులు ప్రచారం చేస్తే, ఈ పరిస్థితులలో అది హాస్యాస్పదమే అవుతుంది. తెలుగుమాధ్యమం ప్రవేశపెడితే అది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకన్నిటికీ సమంగానే వర్తించాల్సి ఉంటుంది. దీన్ని అమలుపరచాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి అవసరం. మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎలా వస్తుంది?

4. పై విషయాలని దృష్టిలోపెట్టుకుంటే, ఇది సమస్యకి దీర్ఘకాలిక పరిష్కారమే కాని, సత్వరంగా సాధించగలిగింది కాదని నాకనిపిస్తోంది. ఇంగ్లీషుమాధ్యమంలో పిల్లలని చదివిస్తున్నా, తెలుగు మరిచిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోడం తక్షణకర్తవ్యం. దీనికి తెలుగుమీద అభిమానం పెరిగి, ఇంగ్లీషుభాష గురించిన అపోహలూ, మోజూ తగ్గడం ముఖ్యం.

5. అసలు తల్లిదండ్రులు ఇంగ్లీషుమీడియము స్కూళ్ళకి పిల్లలని పంపించడానికి ముఖ్యకారణం ఇంగ్లీషేనని అనుకోవడం తప్పు. డబున్నవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళకుండా ప్రైవేటాసుపత్రికి వెళ్ళడానికి కారణం అక్కడ వైద్యులు ఇంగ్లీషు మాట్లాడతారని కాదు కదా! అక్కడైతే మంచి వైద్యం దొరుకుతుందనే నమ్మకంతో. ప్రైవేటు పాఠశాలలకి పిల్లల్ని పంపించడానికి కారణం కూడా అదే. ఇక్కడ ముఖ్యమైన విషయం అవి ప్రభుత్వ-ప్రైవేటు అన్నది, తెలుగు-ఇంగ్లీషు మీడియమూ అన్నదికాదు. ఒకవేళ ప్రైవేటువే మంచివి రెండు పాఠశాలలు ఉండి, అందులో ఒకటి తెలుగుమాధ్యమమూ మరొకటి ఇంగ్లీషు మాధ్యమమూ అయితే, ఇంగ్లీషు మోజుతో ఇంగ్లీషుమీడియం బడికే పంపిస్తారేమో. కానీ ప్రస్తుతం పరిస్థితి అది కాదు. తలిదండ్రులు తమ పిల్లలని ప్రైవేటు పాఠశాలలకి పంపించడానికి మూడు కారణాలున్నాయి:
* ఆ పాఠశాల గురించిన విస్తృత ప్రచారం.
* ప్రైవేటు పాఠశాలలకి లాభాలు ముఖ్యం కాబట్టి, పిల్లలు ఎలాగైనా మంచి రేంకులు పొందేలా చూస్తాయి. తల్లిదండ్రులకి కావలసింది అదే.
* ప్రభుత్వపాఠశాలల్లో సాధారణంగా జవాబుదారీతనం తక్కువకాబట్టి వాటి ఫలితాలమీద నమ్మకం లేకపోవడం.

ఇందులో ఇంగ్లీషుమాధ్యమం ఒరగబెడుతున్నది చాలాతక్కువ. కాబట్టి ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషుమాధ్యమం ప్రవేశపెడితే అక్కడ చదువుల నాణ్యత పెరిగిపోతుందని అనుకోవడం వట్టి భ్రమ. ఈమాత్రం ఇంగితం ప్రజలకి లేకపోవడం దురదృష్టం. ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి నిజాయితీగా ప్రయత్నించకుండా, కంటితుడుపు చర్యలకీ ప్రజాకర్షక చర్యలకీ మాత్రమే పరిమితమవుతాయన్నదానికి ఇది మరో ఉదాహరణ.

6. అంచేత ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషుమాధ్యమం ప్రవేశపెట్టడం అన్న విషయం అటు విద్యాప్రమాణాలు పెరెగడంతో కానీ, ఇటు తెలుగుభాష పరిరక్షణతో కానీ సంబంధం లేని విషయమని నేననుకొంటున్నాను. ఇంగ్లీషుమీడియము కావాలి, వద్దు అనే రెండు వర్గాలవారూ ఈ విషయాన్ని అర్థంచేసుకొని, అనవసరమైన వివాదాన్ని చాలించి, అసలు విషయాలమీద తమ దృష్టిని మళ్ళిస్తే బావుంటుంది!
లేకపోతే పిల్లీ పిల్లీ కొట్టుకొని, రొట్టెముక్క కోతి పాలుచేసిన బాపతే అవుతుంది.

పూర్తిగా చదవండి...

Tuesday, July 22, 2008

"ఒంటె-సుల్తానుగారి డేరా" కథ విన్నారా?

ముందుగా నా ఆలోచనలకి ప్రతిస్పందించిన అందరికీ మరోసారి నెనరులు. నా టపా, సహజంగానే, కొన్ని ప్రశ్నలని లేవనెత్తింది. వాటిపై నా అభిప్రాయాలని మీతో పంచుకోడానికే ఈ టపా. తలెత్తిన ప్రశ్నలు స్థూలంగా ఇవి:

1. మన మాటల్లో ఎలాంటి పదాలకి ఖచ్చితంగా తెలుగే వాడాలి, ఎలాటివాటికి అక్కరలేదు?
2. ఇంగ్లీషు పదాలు తెలుగులో కలిసిపోవడం సహజమైన పరిణామం కాదా? దాని గురించి ఇంత హైరానా పడాల్సిన అవసరం ఏమిటి?
3. తెలుగు భాషలో చాలా కన్నడ, తమిళ, సంస్కృత పదాలు చేరినట్టే ఇంగ్లీషు పదాలు కూడా చేరి భాషని పరిపుష్టం చేస్తున్నాయి కదా?

మొదటి ప్రశ్నకి సమాధానం సులువు కాబట్టి దానితోనే మొదలుపెడతాను. నిజానికి ఇందులో గిరిగీసుకోవాల్సినదేమీ లేదు! నేనన్నదాంట్లో సారాంశం, ఇంగ్లీషు పదాలు వాడుకని తగ్గించే ప్రయత్నం మనం గట్టిగా చెయ్యాలని. ఎవరికి ఎంతవరకూ వీలయితే అంతవరకూ చేసుకుపోడమే. అయితే ప్రతిపదం అచ్చతెలుగులోనే ఉండాలీ అన్న పట్టుదల మాత్రం నాకు లేదు. ఉదాహరణగా నేను "ఫేషను" పదాన్ని ఇచ్చాను. మరికొంత స్పష్టత కోసం ఈ వాక్యాలు చూడండి:

Easy Question pick చేసుకొన్నారు. correctగా answer చేసారు.
మీకు rains పడుతున్నాయా? ఈ రోజు మార్నింగే పడింది.
First candidate కి fourteen out of twenty marks వచ్చి winner అయ్యాడు.

ఒక అయిదు నిమిషాలు టీవీ చూస్తే వినిపించిన వాక్యాలివి. ఇందులో ఎంతశాతం తెలుగు, ఎంతశాతం ఇంగ్లీషు? నేను నా ముందు టపాలో చెప్పినది ఇలాటి చొరబాటు గురించి. మన భాషని రక్షించుకోవాలంటే, ముఖ్యంగా ఇలాటి విపరీతమైన చొరబాటుని అడ్డుకోవాలన్నది నా అభిప్రాయం.
పైన చెప్పిన ఉదాహరణ కాక మనం మరికొన్ని సందర్భాలలో ఇంగ్లీషు పదాలు వాడుతూ ఉంటాము:
1. చాలా ఏళ్ళుగా (కనీసం ఏభైసంవత్సరాలుపైగా) ప్రయోగించబడుతూ, మన భాషలో భాగమైపోయిన పదాలు. ఉదాహరణకి రోడ్డు, వయా మొదలైనవి.
2. రోజువారీ ఉద్యోగానికి సంబంధించిన పదాలు - ఉదాహరణకి client, appraisal మొదలైనవి
3. ఆధునికకాలంలో మనకి కొత్తగా తెలిసిన వస్తువులూ, విషయాలు - ఉదాహరణకి Computer, email, internet మొదలైనవి
పై మూడురకాలైన పదాలకీ తెలుగుపదాలే వాడాలా, ఇంగ్లీషుపదాలు వాడుకోవచ్చా అన్నది (కనీసం కొందరికి) చర్చనీయాంశమే. కానీ ప్రస్తుతం అది నా చర్చకి అప్రస్తుతం. నేను వీటి గురించి మాట్లాడలేదు. నా ఉద్దేశంలో, వీటికన్నా, నేను పైన ఉదహరించిన టీవీ సంభాషణల్లో కనిపించే ఇంగ్లీషుని నివారించడం ముఖ్యం.

ఇక రెండు మూడు ప్రశ్నలు. ఈ రెంటికీ సంబంధం ఉంది. కాబట్టి కలిపే వివరిస్తాను.
ఒక భాషలో పదాలు మరో భాషలో కలిసిపోవడం సహజ పరిణామమా కాదా అన్నది, నాకు తెలిసి, ఎవ్వరూ నిర్ణయించలేరు. ఇక్కడ సహజమంటే ఏవిటి అన్నది శాస్త్రీయంగా నిర్వచించడం బహుశా సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఈ కలిసిపోవడం అనేది ఎందుకు, ఎలా, ఎంత మోతాదులో జరుగుతోందనేది పరిశీలిస్తే, వీటిలో ఉన్న తేడాలు గమనించవచ్చు. మొదటగా ఎందుకన్న ప్రశ్న వేసుకుంటే:
1. పర భాషల ప్రజలతో సన్నిహిత సంబంధం - ఇది ఎక్కువగా రెండు భాషాప్రదేశాల సరిహద్దుల్లో ఎక్కువ గమనించవచ్చు. తెలుగులో కన్నడ, తమిళ, మరాఠీ భాషా పదాలు చేరడం దీనికి ఉదాహరణ. తెలుగుపదాలు కూడా ఆయా భాషల్లోకి వెళ్ళాయి.
2. రాజ్యభాష లేదా పరిపాలనా భాష ప్రజలభాష మీద ప్రభావం చూపించడం. దీనికి ఉదాహరణగా బహుశా ఉర్దూ, సంస్కృతమూ చెప్పుకోవచ్చేమో. (దీనిగురించి నాకు పూర్తిగా తెలీదు. ప్రస్తుతానికి దీనిపై వాదన అనవసరం).
ఒక భాషలో(మాతృభాషలో) మరో భాష(పరాయిభాష) కలిసినప్పుడు సాధారణంగా పరాయిభాషలోని పదాలు మాతృభాషలోని పదాల రూపంలోకి మారిపోతాయి. ఉదాహరణకి మన తెలుగులో నామవాచకాల చివర "డు ము వు లు" చేరడం, హలంతమైన పదాలు అజంతాలుగా మారడం ఇలాటి మార్పులు. పరభాషాపదాల ఉచ్చారణకూడా మాతృభాషలోని ఉచ్చారణకి దగ్గరవుతుంది. ఉదాహరణకి ఉర్దూలో ఉన్న "జ"ఉచ్చారణా, తెలుగులోని "జ" ఉచ్చారణా వేరు. తెలుగులోకి వచ్చిన ఉర్దూ పదాలని తెలుగు "జ" ఉచ్చారణతోనే పలుకుతాం, చాలావరకూ. ఇంకా ఇలాటి మార్పులు మరికొన్ని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే, పరభాష మాతృభాషకి చాలా దగ్గరదైతే తప్పిస్తే, పరభాషలోని పదాలు మాతృభాషలోకి వచ్చినప్పుడు వాటి రూపం కచ్చితంగా మారుతుందని చెప్పవచ్చు. మాతృభాషకుండే వ్యాకరణం (వాక్య నిర్మాణం వగైరా), పరభాష వల్ల మారడం చాలా అరుదు.
ఇక, ఈ భాషల కలయిక అన్నది సాధారణంగా ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమయ్యి ఉంటుంది.

పై విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీషు మన భాషలో ఎలా కలుస్తోందో ఒక్కసారి ఆలోచించండి. ఇంగ్లీషు మన భాషలోకి రావడానికి కారణం పైన చెప్పుకొన్న రెండు కారణాలూ కావుగదా. మరి దేనివల్ల? ఆర్థిక కారణాలవల్ల అన్నది మనకి వెంటనే తట్టే జవాబు. కానీ ఇది సరైన కారణమేనా? దీనిగురించి కాస్త ఆలోచిస్తూ ఉండండి. ఇంగ్లీషు తెలుగులో ఎలా కలుస్తోందో చూసి, మళ్ళీ ఇక్కడికి వద్దాం.
ఇంగ్లీషులో చాలాపదాలు పైనచెప్పుకొన్న తరహాలో మార్పులు చెంది తెలుగులో కలిసిపోయిన మాట నిజమే. కానీ ప్రస్తుత పరిస్థితి అది కాదే! ఇంగ్లీషు పదాలని ఏ మార్పూ జరగకుండానే యథాతథంగా తెలుగు వాక్యాలలో ప్రయోగిస్తున్నాం. ఏకంగా పదబంధాలకి పదబంధాలే ఇంగ్లీషులోవి తెలుగు వాక్యాలలో దర్శనమిస్తున్నాయి. మరొక వింత మీరు గమనించే ఉంటారు. తెలుగుని కూడా ఇంగ్లీషు ఉచ్చారణకి దగ్గారగా చాలా మంది పలకడానికి ప్రయత్నం చేస్తున్నారు! మరి ఇది ఇంగ్లీషు తెలుగులో కలవడమా? తెలుగే రానురాను ఇంగ్లీషుగా మారిపోవడమా? మన తెలుగులో లేని పదాలు ఇంగ్లీషునుంచి స్వీకరించి, తెలుగుకి అనుగుణంగా మార్పు చేసుకుంటే, మన భాష పరిపుష్టమవుతోందని అనుకోడానికి అవకాశం ఉంది కానీ, ఇలా మన భాషలోని పదాలని విడిచి(తుడిచి)పెట్టి పరభాషా పదాలని తెచ్చుకోవడం భాషని పరిపుష్టం చెయ్యడమెలా అవుతుంది?
ఎన్నో పరభాషా పదాలు తెలుగులో కలిసినప్పుడు, ఒక్క ఇంగ్లీషుని మాత్రం బహిష్కరించడం ఎందుకనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికిందనే ఆశిస్తున్నాను. ఇతర భాషాపదాలు మన తెలుగుభాషలో కలిసిన తీరువేరు. ఇంగ్లీషు పదాలు కలుస్తున్న తీరువేరు. ఒకవేళ ఏ భాషైనా (సంస్కృతమని కొందరంటారు) మన తెలుగుభాషా స్వరూపం మారిపోయేటట్టు తెలుగులో కలసిపోయిందని అనుకున్నా, అది జరిగి కనీసం వెయ్యేళ్ళయిపోయింది. దానిగురించి ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏమీ లేదు, చెయ్యాల్సిన అవసరం కూడా నాకు కనిపించదు. కళ్ళ ముందిప్పుడు ఇంగ్లీషు మన తెలుగుభాషని ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం దాన్ని ఆపడానికి (కనీసం తగ్గించడానికి) ప్రయత్నం చెయ్యాలా అక్కరలేదా?

ఈ విషయమై నేనీ మధ్య ఒక మంచి ఇంగ్లీషు వ్యాసం చదివాను. దీన్ని రాసినతను Salikoko S. Mufwene. ఈ టపా చివరలో దాని లింకు (లంకె?) ఇస్తున్నాను (ఇక్కడే ఇస్తే నా టపా పూర్తిగా చదవకుండా అక్కడికి చెక్కేస్తారేమోనని భయం:-).
ఇంగ్లీషు వల్ల ఇతరభాషలు అంతరించిపోతాయనే భయం వట్టి భ్రమ మాత్రమే అని చెప్పే వ్యాసమది. ఇది చూసి చాలా ఆనందించి, ఉత్సాహంగా ఆ వ్యాసం చదివాను. తీరా చదివాక తెలుగు విషయంలో, ఆశ కాదు కదా, భయం మరింత పెరిగింది! ప్రపంచంలో చాలామంది ఇంగ్లీషుని కేవలం బయట ప్రపంచంతో వ్యాపార వాణీజ్యాలకి మాత్రమే వాడుతున్నారనీ, ఆంతరంగికంగ కార్యాలకీ రోజువారీ సంభాషణలకీ తమ స్వభాషనే వాడుతున్నారనీ, అందువల్ల అలా జరిగినంత కాలం వారివారి దేశభాషలకి జరిగే నష్టమేమీ లేదనీ ఆ వ్యాసంలోని సారాంశం. దీనికి ఉదాహరనగా Japan, Hong Kong, Taiwan మొదలైన దేశాలని ప్రస్తావించారు.
మనకి మాత్రం ఇంగ్లీషు మన నిత్యవ్యవహారంలో భాగమైపోతోందే! అంటే ఈ వ్యాసరచయిత సూచించినట్టు మన భాష అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టేగా!

ఇప్పుడు తిరిగి మనం సగంలో వదిలేసిన విషయానికి వద్దాం. ఇంగ్లీషు వాడకం వెనక కారణము కేవలం ఆర్థిక లాభమే అయితే, పై వ్యాసంలో ప్రస్తావించబడిన దేశాల మాదిరి, మన ఇంగ్లీషు వాడకం కూడా మన ఉద్యోగ వ్యాపారాలకి మాత్రమే పరిమితం అయి ఉండాలి కదా. రోజువారీ జీవితంలో ఇంతగా ఇంగ్లీషు చొచ్చుకుపోవడానికి కారణం ఏమిటి? దీనికి కూడా ఆ వ్యాసంలో కొంతవరకూ సమాధానం దొరికింది. భాష సంస్కృతిలో ఒక భాగం. సంస్కృతి మార్పు చెందుతూ ఉంటే దానికనుగుణంగా భాషకూడా మార్పు చెందుతుంది. ఇప్పుడు మన భాషలో వస్తున్న మార్పు కూడా మన సంస్కృతిలో వస్తున్న మార్పులోని భాగంగానే అర్థం చేసుకోవాలన్నమాట. అలానే భాషలోని మార్పు సంస్కృతిలో కూడా మార్పు కలిగిస్తుంది. సంస్కృతి కాలంతో పాటు మారుతుందనడంలో సందేహం లేదు. కానీ, ఆ మార్పు ఏ దిశగా జరుగుతోంది, దాని వల్ల మనకేమిటి లాభం, ఏమిటి నష్టం అని బేరీజు వేసుకోగలిగే పరిపక్వత ఇప్పుడు మనకుందని నేననుకుంటున్నాను. ఈ జరుగుతున్న మార్పు, కేవలం మార్పు కాదు, పరాయి సంస్కృతి మన సంస్కృతిని ఆక్రమించుకోవడం అని నేను భావిస్తున్నాను. దానికి భాషలో మార్పులే ప్రబల నిదర్శనం.
వెనకటికి బ్రిటిషువాళ్ళు పరిపాలించే రోజుల్లోకూడా కొంతమంది - మన దేశాన్ని ఇంతకు ముందు చాలామంది దండెత్తారు, ఆక్రమించుకొని రాజ్యాలుకూడా చేసారు. ఇప్పుడు బ్రిటిషువారు చేస్తున్నదీ అదే. ఇందులో మనం అడ్డుకోవలసిందీ పోరాడవలసిందీ ఏముందీ? - అని అనేవారట. మరి ఆ రోజుల్లో అందరూ అలాగే అనుకుంటే ఇప్పుడు మనకి భారతదేశం అనేదే ఉండేది కాదు కదా!
అలాగే ఇప్పుడు జరుగుతున్నది సాంస్కృతకమైన ఆక్రమణ, మనం విదేశ సంస్కృతికి బానిసలమవుతున్నామన్న స్పృహ కలగకపోతే, మన అస్తిత్వాన్ని కోల్పోతామని నాకనిపిస్తోంది.
ఆర్థికంగా మనం విదేశాల ఆర్థికవ్యవస్థపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి కూడా, కొంతవరకూ దీని పర్యవసానమే అని నాకనిపిస్తుంది.
మరి దీన్ని ఎలా ఆపడం? సొంతభాషని కాపాడుకోడం ఈ దిశగా మనం వేసే మొదటి అడుగని నా నమ్మకం.

Colonisation, Globalisation, and the Future of Languages in the Twenty-first Century - Salikoko S. Mufwene

పూర్తిగా చదవండి...

Sunday, July 20, 2008

మనం మాట్లాడేది తెలుగేనా?

మనం మాట్లాడేది తెలుగేనా అని చాలాసార్లు నాకనుమానం వస్తుంది. ఈ అనుమానం వెనక ఓ కారణం ఉంది. ఎప్పుడో రెండు మూడేళ్ళ క్రితం అనుకుంటాను, టీవీలో ఓ కార్యక్రమం. ఒక విషయాన్నిచ్చి ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా తెలుగులో దాని గురించి మాట్లాడాలి. పాపం అందులో పాల్గొనే తెలుగు జనాలు చాలా కష్టపడి ప్రయత్నించేవారు. అయినా అలా చేసి గెలిచేవారి సంఖ్య చాలా చాలా తక్కువ. ఇది చూసాక, నన్ను నేను గమనించడం మొదలుపెట్టాను. అలా చేసినప్పుడు నేను రోజువారీ సంభాషణల్లో ఎన్ని ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడుతున్నానో గమనించేసరికి నాకు మతి పోయినంత పనయ్యింది!

నాకు తెలుగు సాహిత్యమన్నా భాషన్నా చిన్నపట్నించీ కాస్త అభిమానం ఎక్కువే. అలాంటి నేను, సహజంగా మాట్లాడే సంభాషణల్లో ఇన్నేసి ఇంగ్లీషు పదాలు వాడుతునానని తెలుసుకొనేసరికి, చెప్పొద్దూ, చాలా సిగ్గేసింది. ఇంకొంచెం పరిశీలిస్తే, నేను వాడే ఇంగ్లీషు పదాలకి ఇంచుమించు తొంభైశాతం సాధారణ తెలుగు పదాలు ఉన్నాయని కూడా అర్థమయింది! ఇక నా తలెక్కడపెట్టుకోవాలో నాకే తెలియలేదు. అప్పటినించీ ఓ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. రోజువారీ సంభాషణల్లో, తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగు పదాలున్నవాటికి ఖచ్చితంగా తెలుగే వాడాలన్నది ఆ వ్రతం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదట్లో ఇది అంత సులభమైన పని అని నేననుకోలేదు. కానీ ప్రయత్నించడం మొదలుపెట్టాక అది చాలా చాలా తేలిక అనిపించింది!
ఇప్పుడు మా ఆవిడా, అమ్మాయి మాట్లాడే తెలుగు కర్ణకఠోరంగా వినిపిస్తోంది నాకు :-( పాపకి ఇంగ్లీషు రావాలంటే, రోజూ కొంత సేపు ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడమని, మామూలుగా తెలుగులో మాట్లాడేటప్పుడు దాన్లో అనవసరమైన ఇంగ్లీషు పదాలు వాడొద్దనీ, రెండూ కలిపి మాట్లాడితే ఏ భాషా సరిగా రాదనీ నచ్చచెప్పడం మొదలుపెట్టాను. పాపం వాళ్ళు నా ఘోషని కొంతలో కొంత అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను.

మనం మాట్లాడే తెలుగు భాషలో ఇంగ్లీషు పదాలు చోటుచేసుకోడం ఒక సహజ పరిణామం, దాన్ని అడ్డుకోడం మూర్ఖత్వం అనే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళనడిగే ప్రశ్న ఒక్కటే, ఇది "సహజ" పరిణామమని మీరెందుకనుకుంటున్నారు? ఎక్కువమందిలో ఇది కనిపించినంత మాత్రాన అది సహజమని అనగలమా? ఒక్కసారి ఆలోచించండి.
మనం మాట్లాడే భాషలో ఇంగ్లీషు పదాలు చొచ్చుకురావడం వెనక రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి అసంకల్పితం, మరొకటి తెచ్చి పెట్టుకొంటున్న తద్దినం.
పరదేశంలోనో, స్వదేశంలోనే అయినా బహుళజాతి సంస్థలలోనో పనిచేస్తున్న వారు రోజంతా మాట్లాడేది ఇంగ్లీషులోనే. ఇది తప్పనిసరి. దీనివల్ల మన ఇతర సంభాషణల్లో కూడా, మనకి తెలీకుండానే ఇంగ్లీషు పదాలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు తీవ్రంగా ఏదైనా చర్చించాలంటే, పూర్తిగా ఇంగ్లీషులోకి వెళ్ళిపోడం కూడా తరచూ జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆపడం అంత సులుభం కాదు. అయితే, నాలా తెలుగుభాష మీద ఇష్టం ప్రకోపించినవాళ్ళు (కొవ్వలివారి పరిభాషలో తెలుగుచేసిన వాళ్ళు) ప్రయత్న పూర్వకంగానే దీన్ని మార్చుకోవాలి. నేనింతకుముందు చెప్పినట్టు ఇది అనిపించేంత కష్టం కాదు.
ఇక తెచ్చిపెట్టుకొంటున్న తద్దినం ఏమిటంటే, ఇలా ఇంగ్లీషు ముక్కలు కలిపి మాట్లాడ్డమే ఈనాటి ఫేషననీ, అలా చెయ్యక అచ్చమైన తెలుగులో మాట్లాడేవాళ్ళు రాతియుగంలో గుహల్లో బతికేవాళ్ళనీ కొంతమందిలో ఒక బలమైన విశ్వాసం మశూచికన్నా ఘోరమైన అంటువ్యాధిలా పాకిపోతోంది. ఇలా మాట్లాడితేనే ఇంగ్లీషు భాష వస్తుందన్న అభిప్రాయం ఇందులో మరో అంశం. వీటికి ముఖ్యమైన వాహకాలు సినిమాలూ, టీవీ ఛానళ్ళూ, మన "కల్చరు"ని పెంచి పోషిస్తున్న ఇతర సాధనాలూను. ఈ అంటురోగాన్ని నివారించడానికి ఎదోఒకటి చెయ్యకపోతే, మన భాష సంకర భాష అయిపోయే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.

మరి మీరేమంటారు?

పూర్తిగా చదవండి...

Monday, July 14, 2008

తెలుగు మరచిపోకుండా ఉండాలంటే...

తెలుగువారికి, అందునా అంతర్జాలంలోని తెలుగువారికి రోహిణీప్రసాద్ గారిని పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. చక్కని విశ్లేషాత్మకమైన, విజ్ఞానదాయకమైన వ్యాసాలెన్నో ప్రముఖ ఈ-పత్రికలలో తెలుగువాళ్ళకోసం తెలుగులో రాస్తున్నారు. వారు నా యీ ప్రయత్నానికి స్పందించి అందించిన వ్యాసం ఇది. ఈ వ్యాసం చక్కని ఉపయోగకరమైన చర్చకి మంచి ప్రస్తావన అవుతుందని ఆశిస్తున్నాను. దీనిని మనతో పంచుకున్న రోహిణీప్రసాద్ గారికి నెనరులు. చదివి మీమీ అభిప్రాయాలని తెలియపరిస్తే, మీకూ నెనరులే!

-----------------

తెలుగు మరచిపోకుండా ఉండాలంటే...
-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్

ఈ మధ్య సామాన్య ప్రజల వాడకంలో తెలుగు భాష వెనకబడిపోతోందనీ, ఇంగ్లీష్మీద వ్యామోహం పెరుగుతోందనీ చాలామంది తెలుగు భాషాభిమానులు ఆందోళన చెందుతున్నారు. కనీసం కొన్ని సందర్భాల్లోనయినా తెలుగు అధోగతి పాలవుతోందనడంలో నిజం లేకపోలేదు. ఒక ముఖ్యవిషయం ఏమిటంటే ఇది భారతీయ భాషలన్నిటికీ ఎదురౌతున్న సమస్య. ఇంగ్లీష్ ప్రాబల్యం పెరగకముందే హిందీవల్ల ఉత్తరాది భాషలైన పంజాబీ, సింధీవంటి భాషలు వెనకడుగు వెయ్యడం మొదలైంది. ఆ విషయంలో దక్షిణాది భాషలు కాస్త నయం.
ఇంగ్లీష్ బలపడడం ఇటీవల జరుగుతున్న పరిణామం. ఇందుకు మూలకారణమైన ప్రస్తుతపు ప్రపంచీకరణలో భాగంగా పనిచేస్తున్న బలమైన ఆర్థిక శక్తులున్నాయి. వాటన్నిటికీ సామాన్య ప్రజలు అతీతులుగా ఉండాలనుకోవడం అత్యాశే. సాఫ్ట్వేర్ తదితర ఆధునిక పరిజ్ఞానం సంపాదించిన తెలుగువారు ఇతర భారతీయుల్లాగే దేశవిదేశాల్లో ఉద్యోగ, వాణిజ్య, ఆర్థికపరంగా రాణిస్తున్నారు. డబ్బు సంపాదన విషయంలో ఇంగ్లీష్మీద పట్టు ఉండడం కొంతమందికైనా లాభిస్తోంది. దీని వెంట తప్పనిసరిగా కలుగుతున్న నష్టం తెలుగును చిన్నచూపు చూడడమే. ఆర్థిక రథచక్రాల కింద నలిగిపోతున్న అనేక అంశాల్లో దేశ, ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయి. ఒకటో క్లాసునుంచీ ఇంగ్లీష్ మీడియం ప్రతి స్కూల్లోనూ ప్రవేశపెట్టరాదని తెలుగు భాషావాదులు అంటే పేదవర్గాలు అభ్యంతరం చెప్పడంలో అర్థముంది. అందరూ ఇంగ్లీషు నేర్చుకుని ‘బాగుపడుతూంటే’ తెలుగు భాషను సముద్ధరించాల్సిన పని మా ఒక్కరిదేనా అని వారడుగుతున్నారు. ఈ సవాలు నెదుర్కోవడం ప్రభుత్వాల పని. మనం సూచించగలిగినవి వ్యక్తిగత స్థాయిలో చెయ్యగలిగిన పనులే.
తమాషా ఏమిటంటే తెలుగును పట్టించుకోవడం మానేస్తున్నది ఎక్కువగా మన రాష్ట్రంలోనే. అది కూడా ఎక్కువగా ధనిక, మధ్యతరగతి వర్గాల్లో కనబడుతున్న పరిణామం. తెలుగు ప్రాంతాలకు దూరమవుతున్న కొద్దీ మాతృభాష మీది మమకారం ఎక్కువవుతుందేమో. ఏ పబ్లిక్ స్కూల్లోనో ఇంగ్లీష్ మీడియంలో చదివి, ఐఐటి వగైరాల డిగ్రీలతో అమెరికావంటి దేశాలకు వెళ్ళిన తెలుగు యువకులు అక్కడికి వెళ్ళాక తెలుగుతనం మీద ఆవేశం పెంచుకుని ధోవతులూ, కండువాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది మంచి పరిణామమే.
తెలుగుభాషకు సంబంధించినంతవరకూ ప్రభుత్వస్థాయిలో,ఉద్యమస్థాయిలో చాలా కృషి జరగవలసి ఉంది. కానీ వ్యక్తిగత స్థాయిలో కూడా గట్టి ప్రయత్నాలు జరగాలి. ఒకటి రెండు తరాల క్రితం తాగే నీటిని గురించీ, పీల్చే గాలిని గురించీ అంతగా ఆందోళన పడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఈ నాడు ప్రతిదీ విషపూరితమే. అలాగే తెలుగు కుటుంబాలు తెలుగులో మాట్లాడుకోవడం, తెలుగు పత్రికలూ, పుస్తకాలూ చదవడం సామాన్యమైన విషయాలుగానే పరిగణించబడేవి. ఇప్పుడు అలా కాదు; తెలుగు లిపిని చదవగలిగినవారూ, ఆసక్తితో చదువుతున్నవారూ అరుదైపోవడంతో వారే సాహితీపిపాసులని భావించవలసివస్తోంది. వాతావరణమూ, సాంస్కృతిక వాతావరణమూ కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. తినే తిండి దగ్గరినుంచీ జీవితరంగాలన్నిటిలోనూ సహజత్వానికి దూరమైపోతున్నాం. మనం చాలా విషయాల్లో స్వతంత్రులమని అనుకుంటాం కాని ఈనాటి వినియోగ సంస్కృతి అందరినీ కీలుబొమ్మలుగా తయారుచేస్తోంది. అందుకని కొన్ని మామూలు విషయాలను ప్రత్యేకంగా చర్చించుకో వలసిన అగత్యం ఏర్పడుతోంది.
ఈ సందర్భంలో కొన్ని అనుకూలవిషయాలను కూడా గుర్తుచేసుకోవాలి. తెలుగుతో సంపర్కం కోల్పోకుండా ఉండేందుకు ఈరోజుల్లో ఎన్నో సదుపాయాలున్నాయి. ప్రపంచంలో ఎవరు ఏ మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నా సాటి తెలుగువారు లేకపోయినప్పటికీ ఇంటర్నెట్ ద్వారా అనేక తెలుగు పత్రికలూ, వెబ్సైట్లూ, తెలుగులో సమాచారమూ, సంగీతమూ అందుబాటులో ఉంటాయి. అలాగే చాలా చోట్ల తెలుగు టీవీ చానల్ సదుపాయం లభిస్తోంది. వీటన్నిటితో బాటు తగినంత ఆసక్తి ఉన్నట్టయితే తెలుగు పుస్తకాలూ, పత్రికలూ, పాటలూ తమవద్దకు తెప్పించుకోవడం తెలుగువారికి అసాధ్యమేమీ కాదు.
తెలుగు విషయంలో వ్యక్తిగతస్థాయిలో సామాన్యుడు చెయ్యగలిగినదేమైనా ఉందా? సమస్యకు పరిష్కారం కుటుంబస్థాయిలో పిల్లలతో మొదలవాలి. మాతృభాష నేర్చుకోవడానికి అయిదేళ్ళ లోపు వయసే ఉత్తమమని నిపుణులంటారు. పదిహేనేళ్ళు వచ్చే లోపునే మాతృభాషలో బాగా మాట్లాడడం, చదవడం, రాయడం అలవాటైతే ఇక పరవాలేదు. మధ్యతరగతివారిలో మాతృభాషమీదా, అందులోని సాహిత్యాంశాల మీదా మంచి అభిరుచి కలిగే 15-25 ఏళ్ళ వయసులో యువతీ యువకులకు వృత్తిపరంగానూ, ఆర్జనకు పనికొచ్చే రీతుల్లోనూ ఇతర విషయాలమీద ధ్యాసపెట్టడం ఈ రోజుల్లో తప్పనిసరి అవుతోంది. అవన్నీ మానుకుని తెలుగు భాషాసౌందర్యాన్ని ఆస్వాదించమని వారికి చెప్పి లాభం లేదు. ఇదిలా ఉంటే మరొకవంక లాభార్జన కోసమని తల్లినీ, చెల్లినీ అమ్మేసే వర్గాలు ప్రభుత్వంలోనూ, ప్రసార, ప్రచార మాధ్యమాల్లోనూ రాజ్యం చేస్తున్నాయి. నేటి యువత ఈ ఒత్తిళ్ళన్నిటికీ గురవుతోంది. అందుకని బలమైన శక్తులకు లోనవుతున్న యువత పరిస్థితిని కూడా మనం కాస్త సానుభూతితో అర్థం చేసుకోవాలి. అటు తెలుగు తప్ప మరేదీ రాని పేద ప్రజలకు ఇప్పటికే ఉన్న బాధలతో బాటు తెలుగు ఉపయోగించని అధికార యంత్రాంగంతో మరిన్ని కష్టాలు ఎదురవు తున్నాయి. మధ్యతరగతికి చెందినవారు పూనుకుంటే తప్ప తెలుగుభాషకు సరైన తోడ్పాటు లభించదేమోననిపిస్తుంది.
ఎవరైనా మరీ కష్టపడకుండా చెయ్యదగినపెన్నో ఉన్నాయి. నివసిస్తున్నది ఏ ప్రాంతమైనా తెలుగు కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో తెలుగులో మాట్లాడడం, టీవీ, రేడియోల్లో తెలుగు కార్యక్రమాలు ఇంట్లో పెట్టుకోవడం, వీలున్నప్పుడల్లా మంచి తెలుగు పుస్తకాలు కొని, వాటిని తీరిక వేళల్లో చదివేలా పిల్లల్ని ప్రోత్సహించడం మొదలైనవన్నీ సులువుగా చెయ్యదగిన ప్రయత్నాలు. ప్రవాసాంధ్ర కుటుంబాల్లో తెలుగు అనేది కేవలం అమ్మా నాన్నా మాట్లాడుకునే కోయభాష అనే భావన పిల్లల్లో తగ్గడానికి వాళ్ళని తెలుగు నేర్చుకోవాలని నిర్బంధపెడితే ఉపయోగం ఉండదు. తమ పిల్లలు తెలుగు నేర్చుకోకపోవడం అపరాధం అనే భావన కలిగించడం కన్నా తెలుగులో చదివి ఆనందించ దగిన చిన్న పిల్లల పత్రికలూ, జోక్సూ, నాటికలూ, పాటలూ, పాత సినిమాలూ ఉన్నాయని పిల్లలకు తెలియజేసి, వారిని ఆకర్షించవచ్చు. ఏ ముళ్ళపూడి బుడుగు పుస్తకమో, శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకమో చదవలేనివారికి వారు "మిస్" అవుతున్నదేమిటో ఎలా వివరించగలం? ఉపాయాలు ఎవరికి వారే వెతుక్కోవాలి. ఉదాహరణకు బొంబాయిలో ఉన్నప్పుడు మా పిల్లల చేత డి.వి.నరసరాజుగారి "వాపస్"వంటి సులువైన నాటికలను వేయించాం. చూసినవారికే కాక వేసిన పిల్లలకు కూడా సంతోషం కలిగింది. పిల్లలకు స్వతహాగా ఇటువంటి ప్రేరణ కలగదు. అందుకని పెద్దలు తమ సంస్కారాన్ని మరిచిపోకుండా ఉంటే అది పిల్లలకు కాస్త అబ్బే అవకాశం ఉంటుంది. పుట్టినప్పటినుంచీ ప్రవాసాంధ్రులుగానే జీవిస్తున్న నావంటివారికి చిన్నతనపు ఇంటి వాతావరణమే తెలుగుభాషతో సంపర్కం కోల్పోకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇందులో భాగంగా తెలుగు చదువరులను ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా బాగా జరగాలి. ప్రతిభ ఉన్నవారు తెలుగు గురించి మథనపడడం కన్నా తెలుగులో రచనలు చేస్తూ ఉండడం ముఖ్యం. కల్పనా సాహిత్యంలోనూ, వ్యాసాల్లోనూ వివిధ అంశాల గురించిన తెలుగు రచనలు రావాలి. జీవితాలూ, అనుభవాలూ, దృక్పథాలూ విశాలతరం అవుతున్న పరిస్థితిలో వాటన్నిటినీ ప్రతిబింబించే ఆరోగ్యకరమైన రచనలు వెలువడుతూ ఉంటే భాషతో బాటు పదసంపదా, వ్యక్తీకరణ పద్ధతులూ అన్నీ ఆధునికం అయే అవకాశం ఉంది. తెలుగులో రచనల రాశి పెరిగితే అందులో కొన్నయినా మంచివి వెలువడి పాఠకులకు ఉపయోగకరం కావచ్చు. ఆధునిక మాధ్యమాలన్నిటినీ చక్కగా ఉపయోగించుకో గలిగితే తెలుగుభాష గురించి మరీ నిరాశ చెందనవసరం లేదేమో.
మరొకటేమిటంటే అయిదేళ్ళకొకసారి మనవారికి ఏదో ఒక విధంగా "గత వైభవాన్ని" గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త పాఠకులూ,శ్రోతలూ, ప్రేక్షకులూ తయారవుతూ ఉంటారు. మంచి తెలుగు రచనలని పునర్ముద్రించి యువపాఠకులకి వాటిని పరిచయం చెయ్యాలి. తెలుగు రచయితలూ, విలేకరులూ, పాత్రికేయులూ తమ బాధ్యతలను గుర్తించి, వాటిని సక్రమంగా నిర్వర్తించ గలిగితే సమస్య మరీ తీవ్రం కాకుండా ఉంటుంది. ఇవన్నీ నాకు తోచిన కొన్ని విషయాలు మాత్రమే. విజ్ఞులైన పెద్దలు ఇలాంటి విషయాల గురించి కాస్త ఆసక్తి ప్రదర్శిస్తే మంచి ఉపాయాలు లభించకపోవు.

పూర్తిగా చదవండి...

Monday, July 07, 2008

తెలుగువీర లేవరా!

"మనమూ, మనదీ" అనే భావనకి ఉన్న శక్తి మనందరికీ తెలుసు. అలాంటి ఏకతా భావాన్ని కలిగించే వాటిల్లో, భాష చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుందన్న విషయం కూడా మనందరికీ తెలిసున్నదే. ఈ రోజు ఇంటర్నెట్లో ఇంతమంది తెలుగువాళ్ళు ఇంత కొద్ది కాలంలో సన్నిహితులయ్యారంటే అది తెలుగుభాష చలవే కదా!
మరి అలాంటి మన భాష ఉనికిపై ఈనాడు సందేహాలు కలుగుతున్నాయంటే, "మన" ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందన్నమాటేగా. అయితే, దీనిగురించి ఆలోచించినప్పుడు, అసలు మన తెలుగు భాష నిజంగానే సమస్యల నెదుర్కొంటోందా, లేదా ఇదంతా మనం అనవసరంగా పడుతున్న కంగారా అన్న అనుమానం కలగకపోదు. వచ్చే పది సంవత్సరాల కాలంలో తెలుగు అంతరించిపోయేంత గడ్డుకాలం దాపురించిందని నేననుకోను. కానీ, ఇంకాస్త ముందుకి చూసి, నూరేళ్ళ తర్వాత తెలుగుభాషకి నూరేళ్ళునిండకుండా ఉంటాయా అని ప్రశ్నించుకుంటే, మన ధీమా కాస్త సడలకమానదు. గత ఏభైయేళ్ళుగా వచ్చిన మార్పులని గమనించినా, మన ప్రస్తుత పరిస్థితులని పరిశీలించినా, భాషల భవిష్యత్తుని శాస్త్రీయంగా అంచనా వేసే భాషావేత్తల పరిశోధనలని తరచిచూచినా తెలుగు భాష భవిష్యత్తు మరీ ఆశావహంగా కనిపించటం లేదు.
అసలీ సోదంతా ఎందుకండీ, మన తెలుగుభాషమీద అభిమానమున్న మనం, మన నిత్యవ్యవహారంలో ఎంత శాతం తెలుగువాడుతున్నామో (వాడగలుగుతున్నామో) ఒక్కసారి ఆలోచించండి! మనం రాసే "తెలుగు"బ్లాగుల్లో ఎంతగా ఇంగ్లీషు చొచ్చుకొస్తోందో గమనించండి! నేనంటున్నది, తెలుగులో లేని సాంకేతికపదాల గురించి కాదు. వాటి సంగతి తర్వాత, అసలు మన తెలుగుభాషలో ఉన్న పదాలే గబుక్కున గుర్తురాక ఇంగ్లీషు పదాలు ఎన్నిమార్లు వాడటం లేదు మనం! మన తెలుగుభాషకి సొంతమైన ఎన్ని జాతీయాలూ, ఎన్ని సామెతలూ ఈ రోజు మనం ఉపయోగిస్తున్నాం? ఇక మన పిల్లల సంగతి సరేసరి!
ఇదంతా ఎందుకిలా జరుగుతోంది? ఇది సహజ పరిణామమా? మనకి మన భాషమీద ద్వేషమేమీ లేదే! మరెందుకిలా? అని ఆలోచిస్తే, నాకనిపించిన విషయం - మనకి మన భాషమీద ద్వేషం లేకపోయినా, ఉండాల్సినంత మమకారం లేదేమోనని. మమకారం ఉన్నా, మరేవో శక్తులు ఆ మమకారాన్ని చంపేస్తున్నాయని. వాటిపై తిరుగుబాటు చేసి, మన ఉనికిని మనం కాపాడుకొనే అవసరం మనకుంది. మన తెలుగుభాషలో మనం ఆలోచించలేని నాడు, చక్కగా తెలుగుమాట్లాడలేని నాడు, అందంగా తెలుగు నుడికారాన్ని రాయలేని నాడు మనం తెలుగువాళ్ళగానే మిగలం. అలాంటి విపరీతం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే!
తెలుగుభాష పరిరక్షణకి ప్రభుత్వం కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది, నిజమే. కానీ ఆ అవసరం ప్రభుత్వానికి తెలిసినప్పుడే కదా అది సాధ్యమయ్యేది. ఆ అవసరం ప్రభుత్వానికి తెలిసేలా చెయ్యాల్సిందీ మనమే.

ఈ ఆలోచనలు నాలో చాలా కాలంనుంచీ గుడుసుళ్ళు తిరుగుతున్నాయి. ఈ నెల ఈమాటలో భద్రిరాజుగారి వ్యాసం "తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు" మరింత ప్రేరణనిచ్చింది. ఇలాటి ఉద్యమానికి ఇంటర్నెట్టులోనే నాంది పలకాలన్న ఆలోచన వచ్చింది. తెలుగుని అభిమానించే మన నెజ్జనులంతా పూనుకుంటే, ఇది మంచి ఫలితాలని సాధించగలదన్న నమ్మకమూ కలిగింది. ఎందుకంటే, ఇది "మన" (చదువుకొని పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ) సమస్య కాబట్టి. మనమే దీనికి సరయిన పరిష్కారం ఆలోచించగలం.
ఈ బ్లాగుని కేవలం నా సొంత అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే కాకుండా, మనందరం కలిసి ఆలోచించడానికీ, పనిచెయ్యడానికీ ఒక వేదికగా ఉండలన్న సంకల్పంతో మొదలుపెడుతున్నాను. ప్రత్యేకమైన ప్రణాలికంటూ ప్రస్తుతం ఏమీ లేదు. మీ సలహాలకోసం ఎదురుచూస్తాను.
ఈ బ్లాగుకి ఏం పేరుపెడదామా అని ఆలోచించినప్పుడు "తెలుగువీర లేవరా" అన్న శ్రీశ్రీ పాట చప్పున గుర్తొచ్చింది. ఆ పాటని మన తెలుగుభాష ప్రస్తుత పరిస్థితికి కూడా అన్వయించుకోవచ్చుననిపించింది. ఇదొక రకమైన విప్లవమే, తిరుగుబాటే. అయితే ఈ తిరుగుబాటు ఎవరో పరాయివాళ్ళ మీద కాదు, మనమీదే! మన తెలుగుభాషంటే మనలో పేరుకుపోతున్న నిర్లిప్తత, నిరాసక్తత, చులకన భావాల మీద. వాటిని కలగజేస్తున్న సాంఘిక పరిస్థితుల మీద.
ఇంకా ఎందుకు ఆలశ్యం?

తెలుగువీర లేవరా! దీక్షబూని సాగరా!
తెలుగుభాష మేలుకోరి తిరుగుబాటు చెయ్యరా!


గమనిక: మనమందరం చదువుకున్నవాళ్ళం విజ్ఞానవంతులం కాబట్టి, ఆవేశం కన్నా ఆలోచనకీ, ఉద్రేకం కన్నా ఉపాయానికీ ఎక్కువ విలువనివ్వాలని నా ఆకాంక్ష!
పూర్తిగా చదవండి...