Friday, August 01, 2008

మనకెప్పుడీ మంచి రోజులు?

Effective expression possible only in mother tongue

మన మంత్రులెవరైనా ఈ మధ్యకాలంలో ఇలా మాట్లాడారా? ఎందుకు లేదు? దానికెవరు బాధ్యులు?
మనం మన తమిళ తముళ్ళనించి ఎందుకు నేర్చుకోకూడదు? వాళ్ళది అహంకారమని కొట్టిపారేస్తే అది మనకి సంతృప్తి. ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్యనున్న గీత సన్ననిదే. కానీ ఆత్మగౌరవానికీ, ఆత్మన్యూనతకీ మధ్యనున్న గీత చాలా లావైనదే కదా! నిజానికి మనని మనం తక్కువచేసుకోడం ఒక ఫేషనయిపోయింది. తెలుగువాడు తలచుకుంటే చెయ్యలేనిది లేదు. ఎటొచ్చీ అంతా ఆ తలచుకోడంలోనే ఉంది!
అంతర్లీనంగా మనకి మనమీద చాలా అభిమానమే ఉంది. అంతర్జాలంలో ఇన్ని తెలుగు బ్లాగులు ఇంతగా నడుస్తున్నాయంటే, దానికి కారణం మరేమిటి?
అంతర్జాలంలో ఇంతమందికున్న ఈ తెలుగు భాషాభిమానాన్ని మనం మన రాష్ట్రంలో ప్రజలదగ్గరకి ఎందుకు తీసుకువెళ్ళ కూడాదూ అన్నారు, ఈ మధ్యనే ఒక బ్లాగ్మిత్రుడు.
అది చాలా మంచి ఆలోచన. మరి మీరేమంటారు?

2 comments:

కత్తి మహేష్ కుమార్ said...

మాతృభాష వలన ’భావప్రకటనా తీరు’ మెరుగుపడుతుందన్నది విశ్వవ్యాప్తంగా అంగీకరించిన సత్యం. ఎందుకంటే,భాషకు ఒక సాంస్కృతిక నేపధ్యం ఉంటుంది, ఆ సంస్కృతికి చెందిన విషయాలు ఆ భాషలోనే సంపూర్ణంగా అర్థం చేసుకోగలం,వివరించగలం,అవగాహన చేసుకోగలం.

కాకపోతే కాలగమనంలో మారిన తెలుగు(ఆంధ్రప్రదేశ్) సంస్కృతిని చూస్తే,"తెలుగుతనం అనేది అసలు కనబడదు".అందుకే తెలుగు భాష యొక్క ఉపయోగం మనకు వినబడదు.

తెలుగుతనానికీ తెలుగు భాషకూ ఉన్న అవినాభావసంబంధమే భావప్రకటన. మరి మూలమే కలుషితమైనప్పుడు తద్వారావచ్చిన లక్షాణాన్ని (తెలుగు వాడకపోవడాన్ని) ప్రక్షాళనచెయ్యాలనుకోవడం,"కాలుష్యకారకాల్ని నివారించక, గంగా నదిని మొత్తంగా చేతుల్తో శుభ్రం చేస్తాననడమే"అని నా ఉద్దేశం.

ఇక తెలుగువాడి ఆత్మన్యూనత గురించి చెప్పారు. నా వరకూ తెలుగువాడిది ఆత్మన్యూనత కాదు. కేవలం వ్యాపారధోరణి అంతే.తెలుగువాడెప్పుడూ తెలుగు భాషకోసమో లేక ఆంధ్రప్రదేశ్ కోసమో ఆలోచించడు, కేవలం తన వ్యక్తిగత ప్రగతిని ఆశిస్తాడు.అంటే ఫక్తు స్వార్థమన్నమాట.మన సంస్కృతీ అలాగే తగలడింది,తెలుగువాడూ అంతే!

ఈ ధోరణి ఇప్పట్లో మారే అవకాశంగానీ ఆశగానీ పెట్టుకోవడం అమాయకత్వం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే తెలుగు భావప్రకటన పెరగాలంటే, మన సంస్కృతిలో తెలుగుతనం పెరగాలి,దాని అవసరం ఆర్థికంగా మనవారికి రావాలి.

తమిళ,మళయాల తమ్ముళ్ళు వారి భాషకిచ్చే ప్రాముఖ్యత, గౌరవానికి ఒక సాంస్కృతిక,చారిత్రక నేపధ్యం ఉంది. దానిగురించి నేను రాసిన ఈ క్రింది టపాలు చూడగలరు.
http://parnashaala.blogspot.com/2008/06/blog-post_17.html

http://parnashaala.blogspot.com/2008/05/blog-post_09.html

భైరవభట్ల కామేశ్వర రావు said...

మహేష్ గారు,
తెలుగు భాషకీ సంస్కృతికీ ఉన్న సంబంధం గురించి మీరన్నది నూరుపాళ్ళూ నిజం.
ఇది నా ముందరి టపాలోకూడా నేను చెప్పాను. అయితే సంస్కృతిలో భాషకూడా ఒక భాగమే కాబట్టి, భాష మీద ముందు అభిమానం పెంచుకొంటే దానిద్వారా సంస్కృతి మీద కూడా అభిమానం పెరుగుతుందన్నది నా ఆశ.
మీరన్నట్టు తెలుగువాడికే కాదు, మనిషన్నవాడెవడైనా "స్వార్థం"తోనే ఏ పనైనా చేసేది. ఏ విధమైన ఆర్థిక లాభం లేకపోయినా, కష్టపడి కూడలీ, జల్లెడా లాంటివి మనందరికోసం తయారుచేసారన్నా, ఏ ఆర్థికలాభం లేకుండానే అంతర్జాలంలో తెలుగు పత్రికలు నడుస్తున్నాయన్నా అందులో స్వార్థం లేదనగలమా? మన మానసిక తృప్తి కోసమేగా ఇవన్నీ చేస్తున్నది. అలాగే తెలుగుభాష మన తెలుగువాళ్ళ "స్వ"(నాది) అనే భావనలో ఒక భాగమెందుకవ్వకూడాదూ?
మీరు తమిళులగురించీ మలయాళీలగురించీ చాలా చక్కని విశ్లేషణ చేసారు. దాన్నుంచి మనం ఏవిటి నేర్చుకోవాలి? వాళ్ళకున్న చారిత్రక సామాజిక కారణాలు మనకి లేవుకాబట్టి మనమింతే అనుకొనే నిరుత్సాహమా? ఆ చరిత్ర, సమాజమూ అక్కడి ప్రజలు సృష్టించినవే, ఆకాశంలోంచి ఊడిపడలేదు, అలానే మనమూ ఎందుకు మారలేమూ అన్న ఆలోచనా? ఏది సమంజసం?
మీరన్నట్టు ఆర్థిక లాభమే ప్రథాన మనుకొందాం. మరి తమిళ/మలయాళీ వాళ్ళ స్వాభిమానంవల్ల వాళ్ళకి ఆర్థికమైన లాభాలెన్ని కలగటంలేదు? అందుకోసమైనా మనం మారలేమా?
మనకున్న విజ్ఞానం మనలని ఆశావాదం వేపు నడిపిస్తేనే అది విజ్ఞత అనిపించుకుంటుంది. ఆలోచనతోబాటు, ఆశావహ దృక్పథం మనమీద మనకి నమ్మకం అవసరం. ఒక తెలుగువాడిగా నామీదా, నా తెలుగుజాతిమీదా నాకా నమ్మకం ఉంది!