Monday, August 18, 2008

మనలని అంతర్లీనంగా కలిపే సూత్రం ఏది?

మొన్న బ్లాగాడించే రవిగారు "దేశభక్తి అంటే ఏమిటి?" అని చురుగ్గా ఓ ప్రశ్న వేసారు, స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా. అయితే అందులో, అదేవిటో తెలుసుకొనే ఆలోచనలకన్నా, అది శుద్ధ దండుగమారి ఆవేశమేనా అనే ఒక భావన లీలగా కనిపించింది. దానికి నేనక్కడ నాకు తోచిన నాలుగుముక్కలు కామెంటేను. కానీ అసలు ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. "దేశభక్తి అంటే ఏమిటి?"

దేశభక్తి అనగానే నాకు తెలుగులో రెండు గొప్ప గీతాలు, రెండూ దేశభక్తి గీతాలే, గుర్తుకొస్తాయి. ఒకటి గురజాడ "దేశమును ప్రేమించుమన్నా", మరొకటి దేవులపల్లి "జయ జయ ప్రియభారత జనయిత్రి". ఈ రెంటినీ ఒకే దేశభక్తి కవిత్వపు గాటకి కట్టేసే విమర్శకాగ్రేసరులున్నారు. కానీ అది సరికాదు. గురజాడది అభ్యుదయంతో కూడిన దేశభక్తి అయితే, దేవులపల్లిది కాల్పనిక భావావేశంతో కూడుకొన్న దేశభక్తి. నన్నడిగితే ఈ రెండూ మనకి అవసరమే! ఒకటి స్ఫూర్తినిస్తే మరొకటి కార్య నిర్దేశం చేస్తుంది.
"దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్!" అని చాలా స్పష్టంగా దేశభక్తిని నిర్వచించాడు గురజాడ. కేవలం భౌగోళికమైన సరిహద్దుల (Geographical boundaries) దృష్ట్యా మనం మన దేశమ్మీద అభిమానం పెంచుకోవడం నిరర్ధకం. అది కృతకమైన దేశభక్తి. "మనది" అనే ఒక భావన మన దేశప్రజలనందరినీ కలిపితే, దాని ద్వారా మనకి మనవాళ్ళపైన కలిగే ప్రేమా అభిమానం నిజమైన దేశభక్తి అని నా ఉద్దేశం. ఆ "మనది" అనే భావన ఎక్కడనుంచి వస్తుంది? మనలని అంతర్లీనంగా కలిపే ఆ సూత్రం ఏది? ఈ ప్రశ్నలకి నాకు తోచిన జవాబు భారతీయమైన సంస్కృతి. దేశభక్తి అనే కన్నా జాతీయత దీనికి సరైన పదం అనుకుంటా.

ఇంతకీ ఈ సోదంతా ఇక్కడెందుకు రాస్తున్నాను? ఆ మధ్య చర్చల్లో కత్తి మహేష్ గారన్నారు, తెలుగు సంస్కృతి మారిపోతూ ఉంటే దానికనుగుణంగానే తెలుగుభాష మారుతోంది. కాబట్టి తెలుగుభాషని మాత్రమే ఉద్ధరిద్దామనుకుంటే అయ్యే పని కాదూ అని. సంస్కృతీ భాషల మధ్య సంబంధం గురించి వారన్నది ముమ్మాటికీ నిజమే. అందుకే భాష గురించి ఆలోచించేటప్పుడు సంస్కృతిగురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనిపించింది.
సంస్కృతి అంటే పండగలూ పబ్బాలూ, పూజలూ పునస్కారాలే కాదు. సంస్కృతి అంటే మనదైన జీవన విధానం, విలువలు, దృక్పథం. ఇవన్నీ మనకంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు అనిపించకపోయినా, కాలం మనకి దీని ప్రాముఖ్యాన్ని గుర్తుచెయ్యక మానదు. మన అస్తిత్వం ఏవిటి, మనం ఎవరం అనే ప్రశ్న, ఒక జాతిగా మన తెలుగువాళ్ళం, మన భారతీయులం వేసుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికైనా వస్తుంది. అప్పుడు మనల్ని మనం సాంస్కృతికంగా పునరావలోకనం చేసుకొని, మనది అన్నదాన్ని స్థాపించుకొని, పునరుజ్జీవులం కావల్సిన అగత్యం ఏరపడుతుంది. సాంస్కృతిక పునరుజ్జీవనం (Cultural Renaissance) అంటే వెయ్యేళ్ళు వెనక్కి వెళ్ళడం కాదు. పాతనంతా మళ్ళీ నెత్తికెత్తుకోవడమూ కాదు. మన మూలాలని మనం స్పష్టంగా తెలుసుకొని, దాని ఆధారంగా మనకే స్వంతమైన ఒక కొత్త సంస్కృతిని సృష్టించుకోవడం.

మన భారతీయ సంస్కృతిలో నాకు కనిపించే, మనం నిలబెట్టుకోవాలనిపించే, మౌలిక లక్షణాలు నాలుగు:

1. శ్రామికత - శారీరికమైన శ్రమకి మన సంస్కృతి విలువనిస్తుంది. శారీరక సౌఖ్యమే ప్రధానమనే భావన మనది కాదు. మానసిక ఆనందం మనకి ముఖ్యం. కానీ ఇప్పుడు శారీరిక సుఖమే పరమావధి అనే భావానికి మనం లొంగిపోతున్నాం. నడక దూరంలో ఉన్నదానికైనా మోటారు బళ్ళమీదే వెళుతూ, ఆరోగ్యంకోసం ప్రత్యేకంగా ముక్కుతూ మూలుగుతూ "morning walk" చేసే పరిస్థితి ఎవరికీ హాస్యాస్పదం అనిపించటం లేదు! మానసిక"అవసరాలు" "లగ్జరీ"లవుతున్నాయి. శారీరకంగా కష్టపడుతున్నా, మానసికంగా సంతృప్తితో ఆనందంతో ఉండేవాళ్ళని చూసి, వాళ్ళ ఆనందం వట్టి భ్రమ అని ఈసడించుకొనే ఒక విపరీత ధోరణి మనకి అలవాటవుతోంది. దీన్నుంచి బయటపడాలి.

2. ప్రకృతితో చెలిమి - ప్రకృతితో అతి సన్నిహితంగా జీవితాన్ని గడపడం మన సంస్కృతిలో ఒక ముఖ్యభాగం. మన వేషభాషలూ, ఆహారవ్యవహారాలూ, ఆచారాలూ అన్నీ ప్రకృతితో ముడిపడ్డవే. దీనికీ మనం దూరమైపోతున్నాం.

3. ధార్మికత - మన దేశంలో మూఢాచారాలూ, దురాచారాలూ ఉండిన మాట వాస్తవమే. వాటిని నిర్మూలించుకోవడం చాలా అవసరమేనూ. కానీ, వాటిని మనం భూతద్దంలో చూస్తూ, మన సంస్కృతి అంటే ఆ దురాచారాలు తప్పిస్తే మరేమీ లేదూ అనుకోవడానికి అలవాటుపడుతున్నాం. అది చాలా దురదృష్టకరం. మనిషిని మనిషి ప్రేమించాలని చెప్పే మానవత్వం, ఇతరులకి ఉపకారం చెయ్యాలని ప్రబోధించే నీతి ధర్మ సూత్రాలెన్నో మన సంస్కృతిలో అంతర్భాగమై, మన భారతీయుల జీవితాలని నడిపించాయి. కేవల వ్యాపారాత్మక దృష్టి ప్రబలి మనమీ మౌలిక సూత్రానికి దూరమవుతున్నాం.

4. గ్రహణ/సహన శక్తి - ఇంగ్లీషులో దీన్ని "Open mind and Tolerance" అని అనవచ్చు. ఇందులో భారతీయులకి మించినవాళ్ళే లేరేమొ! ఇది మన బలహీనతకాదు, శక్తి అని మనం గుర్తించాలి.

మన సంస్కృతిలో భాగం కానిదీ, మనం పాశ్చాత్యులనుండి నేర్చుకోవలసిందీ వైజ్ఞానికత (వైజ్ఞానిక దృష్టి). ఈ అయిదింటి కలయికతో మనదైన సంస్కృతిని మనం సృష్టించుకోవాలి. అలా చేసినప్పుడు మనకంటూ ఒక విశిష్టమైన అస్తిత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ప్రపంచానికీ, మానవజాతికీ మనదంటూ ఒక ప్రత్యేకమైన contribution (దీనికి సరైన తెలుగుపదం నాకు తట్టడం లేదు) ఇచ్చినవాళ్ళమవుతాం.
"నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించానూ" అని గర్వంగా పాడుకోగలుగుతాం!

8 comments:

Ghanta Siva Rajesh said...

Correct ga cheparu
Great Job
Keep it up

సురేష్ బాబు said...

చాలా బాగా చెప్పారండి.అందరూ వీటిని వంటబట్టించుకొంటే ఎంతో మంచిది.

Kathi Mahesh Kumar said...

మీరు చెప్పిన అన్ని లక్షణాలూ దక్షిణాసియాలోని (పాకిస్తాన్తో సహా) అన్ని దేశాలలోనూ ఉన్నాయని నాకనిపిస్తోంది.ఇకమీరు ఉటంకించిన 1,4 బిందువులు యూరోప్ అమెరికాలలో మనకన్నా మెండుగా ఉన్నాయి.

కాబట్టి ఆ కొన్నిలక్షణాలూ భారతదేశాన్ని విలక్షణమైన "మన దేశం" గా మార్చడం అనుకోవడానికి గర్వంగా,తృప్తిగా అనిపించినా "పూర్ణ సత్యం" కాకపోవచ్చు.మీరు లక్షణాలతోపాటే అవలక్షణాలనుకూడా చెప్పిమరీ దేశభక్తిని పెంచుకోమన్నారు కాబట్టి నా సందేహం తీరకుండా ఇంకా గట్టిపడింది.

నేనూ నా బ్లాగులో ఒక టపా రాసేశాను చదివి మీ అభిప్రాయాన్ని తెలుగలరు.

పెదరాయ్డు said...

తులనాత్మక పరిశీలన,పద్దతిగా వున్నాయి. ఇటువంటి మార్గాలు మనకు మంచిని చేస్తాయి. నడుం బిగిద్దాం.

చిలమకూరు విజయమోహన్ said...

బాగా చెప్పారు. ప్రతి పౌరుడూ వీటిని వంటపట్టించుకుంటే సమస్యే వుండదు.

రవి said...

నిదానంగా ప్రతిస్పందిస్తున్నందుకు మన్నించాలి. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన వివిధ భావలను imbibe చేసుఓవడం జాతీయత అనడం అందంగా, ఇబ్బంది లేకుండా ఉంది.

contribute = సహకారం (అనవచ్చునా?)

గిరి Giri said...

మహేష్ కుమార్ గారు, నే ననుకోవడ మేమిటంటే, మిమ్మల్ని తృప్తి పరచాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి
1. భారతదేశాన్ని పొగడకూడదు
ఒకవేళ పొగిడితే
(ఇతర దేశాలని తప్పక పొగడాలి లేక
తెలుగు వారిని తిట్టాలి)
2. తెలుగు వారివి పొగడకూడదు
ఒకవేళ పొగిడితే
(అరవ వాళ్ళనో, మళయాళీయులనో పొగడాలి లేక
తెలుగు వారిలో కొన్ని వర్గాలని తిట్టాలి)
పైరెండు ఎవరైనా పొరపాటున చేసారో, జాగు చేయక మీరు మీ బ్లాగులో కుండలీకరణాలలోనివి కొత్త టపాలుగా వ్రాసిపారేస్తారు. కదూ?

చిన్నమయ్య said...

భైరవభట్లగారూ, టపా శీర్షికా, విషయమూ ఆలోచింపజేసేయి. ఈ విషయం మీదే టున్ డా. మహాతిర్ బిన్ మహమ్మద్ (మలేసియా మాజీ ప్రధాని) ప్రసంగంలో విన్నాను.

"మనలని అంతర్లీనంగా కలిపే సూత్రం ఏది?"
ప్రపంచంలో ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు కలహించుకోవడం చూస్తున్నాము. ఒకే వూరి వారూ అన్ని వేళలా కలసి వుండలేకపోతున్నారు. ఒకే కులము, ఒకే శాఖ, ఒకే గోత్రం, ఒకే మతమూ, ఒకే భాష, ఒకే యాస, ఒకే చర్మ వర్ణం - ఈ సారూప్యాలేవీ వైషమ్యాలు లేని మానవ సహ జీవనానికి భరోసా కాలేవు. మరి మనుషులని కలిపి వుంచేదేది?

ఒకే "విలువలని" అంగీకరించేవారు ఎప్పటికీ కలిసి వుండగలరు. ఆ విలువలు హ్యూమన్ వేల్యూస్ అయినట్లయితే, ఆ సమాజం జాతికి తలమానికం కాగలదు. పొరపొచ్చాలు లేని ఆలూమగలనైనా, మిత్రులనైనా మరెవ్వరినైనా గమనిస్తే ఈ సూత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.