Monday, July 28, 2008

ఆంగ్లమాధ్యమం - అనవసర వివాదం

పాఠశాలల్లో ఇంగ్లీషుమాధ్యమం గురించి చాలా తర్జనభర్జనలు జరిగాయి, జరుగుతున్నాయి. వార్తిక్ గారు కంచా ఐలయ్యగారి వ్యాసాన్ని ప్రస్తావించి, అతని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నాన్నారు.
దాని గురించి నా ఆలోచనలివి:

1. ప్రాథమిక విద్యాభ్యాసం (ఆరవ తరగతి వరకూ) మాతృభాషలో జరిగితేనే పిల్లలకి చక్కగా చదువు ఒంటబడుతుందని భాషా శాస్త్రజ్ఞులూ మనోవైజ్ఞానికులూ తేల్చిచెప్పినా, దాన్ని ఒప్పుకోమూ అనడం మన మూర్ఖత్వమే అవుతుంది.

2. ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగుభాషాలో జరిగితే తెలుగుభాషకి మేలు జరుగుతుందనడంలో కూడా సందేహమేమీ లేదు. అంటే దీనివల్ల ఇటు పిల్లలకీ, అటు భాషకీ కూడా మంచే జరుగుతుందన్నమాట.

3. అయితే, ప్రస్తుత పరిస్థితులలో అది ఎంతవరకూ సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుందీ అన్నది ఆలోచించాల్సిన విషయం. హఠాత్తుగా వచ్చే ఏడాదినుంచీ దీన్ని అమలుపరిచేద్దాం అంటే జరిగే పని కాదు. అలానే, మీ పిల్లలని ఇంగ్లీషుమీడియం స్కూళ్ళలో చేర్పించవద్దని తెలుగుభాషాభిమానులు ప్రచారం చేస్తే, ఈ పరిస్థితులలో అది హాస్యాస్పదమే అవుతుంది. తెలుగుమాధ్యమం ప్రవేశపెడితే అది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకన్నిటికీ సమంగానే వర్తించాల్సి ఉంటుంది. దీన్ని అమలుపరచాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి అవసరం. మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎలా వస్తుంది?

4. పై విషయాలని దృష్టిలోపెట్టుకుంటే, ఇది సమస్యకి దీర్ఘకాలిక పరిష్కారమే కాని, సత్వరంగా సాధించగలిగింది కాదని నాకనిపిస్తోంది. ఇంగ్లీషుమాధ్యమంలో పిల్లలని చదివిస్తున్నా, తెలుగు మరిచిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోడం తక్షణకర్తవ్యం. దీనికి తెలుగుమీద అభిమానం పెరిగి, ఇంగ్లీషుభాష గురించిన అపోహలూ, మోజూ తగ్గడం ముఖ్యం.

5. అసలు తల్లిదండ్రులు ఇంగ్లీషుమీడియము స్కూళ్ళకి పిల్లలని పంపించడానికి ముఖ్యకారణం ఇంగ్లీషేనని అనుకోవడం తప్పు. డబున్నవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళకుండా ప్రైవేటాసుపత్రికి వెళ్ళడానికి కారణం అక్కడ వైద్యులు ఇంగ్లీషు మాట్లాడతారని కాదు కదా! అక్కడైతే మంచి వైద్యం దొరుకుతుందనే నమ్మకంతో. ప్రైవేటు పాఠశాలలకి పిల్లల్ని పంపించడానికి కారణం కూడా అదే. ఇక్కడ ముఖ్యమైన విషయం అవి ప్రభుత్వ-ప్రైవేటు అన్నది, తెలుగు-ఇంగ్లీషు మీడియమూ అన్నదికాదు. ఒకవేళ ప్రైవేటువే మంచివి రెండు పాఠశాలలు ఉండి, అందులో ఒకటి తెలుగుమాధ్యమమూ మరొకటి ఇంగ్లీషు మాధ్యమమూ అయితే, ఇంగ్లీషు మోజుతో ఇంగ్లీషుమీడియం బడికే పంపిస్తారేమో. కానీ ప్రస్తుతం పరిస్థితి అది కాదు. తలిదండ్రులు తమ పిల్లలని ప్రైవేటు పాఠశాలలకి పంపించడానికి మూడు కారణాలున్నాయి:
* ఆ పాఠశాల గురించిన విస్తృత ప్రచారం.
* ప్రైవేటు పాఠశాలలకి లాభాలు ముఖ్యం కాబట్టి, పిల్లలు ఎలాగైనా మంచి రేంకులు పొందేలా చూస్తాయి. తల్లిదండ్రులకి కావలసింది అదే.
* ప్రభుత్వపాఠశాలల్లో సాధారణంగా జవాబుదారీతనం తక్కువకాబట్టి వాటి ఫలితాలమీద నమ్మకం లేకపోవడం.

ఇందులో ఇంగ్లీషుమాధ్యమం ఒరగబెడుతున్నది చాలాతక్కువ. కాబట్టి ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషుమాధ్యమం ప్రవేశపెడితే అక్కడ చదువుల నాణ్యత పెరిగిపోతుందని అనుకోవడం వట్టి భ్రమ. ఈమాత్రం ఇంగితం ప్రజలకి లేకపోవడం దురదృష్టం. ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి నిజాయితీగా ప్రయత్నించకుండా, కంటితుడుపు చర్యలకీ ప్రజాకర్షక చర్యలకీ మాత్రమే పరిమితమవుతాయన్నదానికి ఇది మరో ఉదాహరణ.

6. అంచేత ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషుమాధ్యమం ప్రవేశపెట్టడం అన్న విషయం అటు విద్యాప్రమాణాలు పెరెగడంతో కానీ, ఇటు తెలుగుభాష పరిరక్షణతో కానీ సంబంధం లేని విషయమని నేననుకొంటున్నాను. ఇంగ్లీషుమీడియము కావాలి, వద్దు అనే రెండు వర్గాలవారూ ఈ విషయాన్ని అర్థంచేసుకొని, అనవసరమైన వివాదాన్ని చాలించి, అసలు విషయాలమీద తమ దృష్టిని మళ్ళిస్తే బావుంటుంది!
లేకపోతే పిల్లీ పిల్లీ కొట్టుకొని, రొట్టెముక్క కోతి పాలుచేసిన బాపతే అవుతుంది.

4 comments:

రానారె said...

ఇది ప్రజాకర్షక పథకమే. ప్రాథమిక విద్య మాతృభాషలో వుండాలనే విషయాన్ని మన దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ఆంగ్లేయులే గుర్తించారని భద్రిరాజు కృష్ణమూర్తిగారు చెప్పినట్టున్నారు (ఆ ఇంటర్‌వ్యూను నేను ఒక్కసారే విన్నాను - 2008 జూలై 'ఈమాట' లో 'శబ్దతరంగాలు').

Kathi Mahesh Kumar said...

ఇదొక ప్రజాకర్షణ పధకం అన్నది ఎంత సత్యమో,దీనివలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బోలెడంత నిధులు మిగులుతాయనడం కూడా అంతే సత్యం.

పాఠశాల విద్యను 12 వతరగతివరకూ పొడిగించి, CBSC సిలబస్ ప్రవేశపెడితే,కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ఆదుకుంటుంది.
మనం ఈ విధానాన్ని వ్యతిరేకించాలంటే, ప్రజల్నందరినీ అధిక పన్నులకోసం తయారుచేద్దాం (అది సాధ్యమైతేనే). లేకుంటే,సైలెంటుగా ప్రభుత్వనిర్ణయాన్ని భరిద్దాం.

Sankar said...

ముందుగా మీ బ్లాగుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.. మీ భాషాభిమానానికి నేను అభిమానినైపోయాను.. నేను మహేష్‍గారి బ్లాగులో రాసిన కామెంటు మిమ్మల్ని ఉద్దేశించి కాదు, చాలా మంది చెప్పేదొకటి చేసేదొకటి... అలాంటి వాళ్ళకు మాత్రమే...

మీరు చెప్పిన పాయింట్లన్నీ బావున్నాయి. ఏదో మీడియం మార్చినంత మాత్రానా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మారిపోవన్నది అక్షర సత్యం. అసలు చానాల్లుగా తెలుగుకి అలవాటు పడిపోయినా టీచర్లకి ఇది చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. రెంటికీ చెడ్డ రేవడంటే ఇదే. అసలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టేకన్నా ప్రవేటు స్కూల్లలో నిర్భంద తెలుగు మీడీయం కనీసం ఐదవ తరగతి వరకన్నా అమలు చేస్తే (కావాలంటే ఇంగ్లీష్‍ని అప్పటివరకూ సెకండ్ లాంగ్వేజిగా ఉంచి) మంచిది. ఇంగ్లీషేదో బ్రహ్మవిద్యన్నట్టు అన్నప్రాసనతోనే మొదలెట్టాల్సిన పనేంటో... ఇక్కడ ప్రాబ్లెం అదే.. నేను మహేష్‍గారి బ్లాగ్‍లో కూడా ఇదే చెప్పా.. ఇప్పుడు పట్టించుకోకుంటే రేపటి తరానికి తెలుగు అవసరం పోయి అది ఒక ఎగ్జామ్ సబ్జెక్ట్ లా అయిపోతుంది. నేను ఇప్పుడు ఐర్లండ్‍లో ఉంటున్నాను.. ఇక్కడ ఒక ఐరిష్ కుర్రాడికి స్టడీస్‍లో హెల్ప్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు, వాడు సడెన్‍గా ఐరిష్ టెక్స్ట్ బుక్ తీసి చెప్పమంటున్నాడు. నాకు రాదంటే.. అదేంటి మీకీ సబ్జెక్ట్ లేదా అన్నాడు. ఇదే పరిస్ధితి వెంటనే కాకున్నా ఓ ముప్పై నలభయ్యేళ్ళ తర్వాత మనకి కూడా వస్తుంది.

కామేశ్వరరావు said...

శంకర్ గారు,
నా మనవిని మన్నించి నా బ్లాగుని చూసినందుకూ, మీ అభిప్రాయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు.
మీరన్నట్టు ప్రైవేటు పాఠశాలల్లో కూడా అయిదవతరగతి దాకా తెలుగుమీడియం ఉండాలన్నది మంచి ఆలోచనే. అయితే దాని గురించి నిపుణులు విస్తృతంగా చర్చించి సరైన విధంగా అమలుచెయ్యాలి. ఇది ఒక్కసారిగా సాధ్యపడదు. మనం (తెలుగువాళ్ళందరూ) దీని అవసరాన్ని గుర్తించడం ఆ దిశగా వేసే తొలి అడుగు.