Monday, July 14, 2008

తెలుగు మరచిపోకుండా ఉండాలంటే...

తెలుగువారికి, అందునా అంతర్జాలంలోని తెలుగువారికి రోహిణీప్రసాద్ గారిని పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. చక్కని విశ్లేషాత్మకమైన, విజ్ఞానదాయకమైన వ్యాసాలెన్నో ప్రముఖ ఈ-పత్రికలలో తెలుగువాళ్ళకోసం తెలుగులో రాస్తున్నారు. వారు నా యీ ప్రయత్నానికి స్పందించి అందించిన వ్యాసం ఇది. ఈ వ్యాసం చక్కని ఉపయోగకరమైన చర్చకి మంచి ప్రస్తావన అవుతుందని ఆశిస్తున్నాను. దీనిని మనతో పంచుకున్న రోహిణీప్రసాద్ గారికి నెనరులు. చదివి మీమీ అభిప్రాయాలని తెలియపరిస్తే, మీకూ నెనరులే!

-----------------

తెలుగు మరచిపోకుండా ఉండాలంటే...
-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్

ఈ మధ్య సామాన్య ప్రజల వాడకంలో తెలుగు భాష వెనకబడిపోతోందనీ, ఇంగ్లీష్మీద వ్యామోహం పెరుగుతోందనీ చాలామంది తెలుగు భాషాభిమానులు ఆందోళన చెందుతున్నారు. కనీసం కొన్ని సందర్భాల్లోనయినా తెలుగు అధోగతి పాలవుతోందనడంలో నిజం లేకపోలేదు. ఒక ముఖ్యవిషయం ఏమిటంటే ఇది భారతీయ భాషలన్నిటికీ ఎదురౌతున్న సమస్య. ఇంగ్లీష్ ప్రాబల్యం పెరగకముందే హిందీవల్ల ఉత్తరాది భాషలైన పంజాబీ, సింధీవంటి భాషలు వెనకడుగు వెయ్యడం మొదలైంది. ఆ విషయంలో దక్షిణాది భాషలు కాస్త నయం.
ఇంగ్లీష్ బలపడడం ఇటీవల జరుగుతున్న పరిణామం. ఇందుకు మూలకారణమైన ప్రస్తుతపు ప్రపంచీకరణలో భాగంగా పనిచేస్తున్న బలమైన ఆర్థిక శక్తులున్నాయి. వాటన్నిటికీ సామాన్య ప్రజలు అతీతులుగా ఉండాలనుకోవడం అత్యాశే. సాఫ్ట్వేర్ తదితర ఆధునిక పరిజ్ఞానం సంపాదించిన తెలుగువారు ఇతర భారతీయుల్లాగే దేశవిదేశాల్లో ఉద్యోగ, వాణిజ్య, ఆర్థికపరంగా రాణిస్తున్నారు. డబ్బు సంపాదన విషయంలో ఇంగ్లీష్మీద పట్టు ఉండడం కొంతమందికైనా లాభిస్తోంది. దీని వెంట తప్పనిసరిగా కలుగుతున్న నష్టం తెలుగును చిన్నచూపు చూడడమే. ఆర్థిక రథచక్రాల కింద నలిగిపోతున్న అనేక అంశాల్లో దేశ, ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయి. ఒకటో క్లాసునుంచీ ఇంగ్లీష్ మీడియం ప్రతి స్కూల్లోనూ ప్రవేశపెట్టరాదని తెలుగు భాషావాదులు అంటే పేదవర్గాలు అభ్యంతరం చెప్పడంలో అర్థముంది. అందరూ ఇంగ్లీషు నేర్చుకుని ‘బాగుపడుతూంటే’ తెలుగు భాషను సముద్ధరించాల్సిన పని మా ఒక్కరిదేనా అని వారడుగుతున్నారు. ఈ సవాలు నెదుర్కోవడం ప్రభుత్వాల పని. మనం సూచించగలిగినవి వ్యక్తిగత స్థాయిలో చెయ్యగలిగిన పనులే.
తమాషా ఏమిటంటే తెలుగును పట్టించుకోవడం మానేస్తున్నది ఎక్కువగా మన రాష్ట్రంలోనే. అది కూడా ఎక్కువగా ధనిక, మధ్యతరగతి వర్గాల్లో కనబడుతున్న పరిణామం. తెలుగు ప్రాంతాలకు దూరమవుతున్న కొద్దీ మాతృభాష మీది మమకారం ఎక్కువవుతుందేమో. ఏ పబ్లిక్ స్కూల్లోనో ఇంగ్లీష్ మీడియంలో చదివి, ఐఐటి వగైరాల డిగ్రీలతో అమెరికావంటి దేశాలకు వెళ్ళిన తెలుగు యువకులు అక్కడికి వెళ్ళాక తెలుగుతనం మీద ఆవేశం పెంచుకుని ధోవతులూ, కండువాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది మంచి పరిణామమే.
తెలుగుభాషకు సంబంధించినంతవరకూ ప్రభుత్వస్థాయిలో,ఉద్యమస్థాయిలో చాలా కృషి జరగవలసి ఉంది. కానీ వ్యక్తిగత స్థాయిలో కూడా గట్టి ప్రయత్నాలు జరగాలి. ఒకటి రెండు తరాల క్రితం తాగే నీటిని గురించీ, పీల్చే గాలిని గురించీ అంతగా ఆందోళన పడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఈ నాడు ప్రతిదీ విషపూరితమే. అలాగే తెలుగు కుటుంబాలు తెలుగులో మాట్లాడుకోవడం, తెలుగు పత్రికలూ, పుస్తకాలూ చదవడం సామాన్యమైన విషయాలుగానే పరిగణించబడేవి. ఇప్పుడు అలా కాదు; తెలుగు లిపిని చదవగలిగినవారూ, ఆసక్తితో చదువుతున్నవారూ అరుదైపోవడంతో వారే సాహితీపిపాసులని భావించవలసివస్తోంది. వాతావరణమూ, సాంస్కృతిక వాతావరణమూ కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. తినే తిండి దగ్గరినుంచీ జీవితరంగాలన్నిటిలోనూ సహజత్వానికి దూరమైపోతున్నాం. మనం చాలా విషయాల్లో స్వతంత్రులమని అనుకుంటాం కాని ఈనాటి వినియోగ సంస్కృతి అందరినీ కీలుబొమ్మలుగా తయారుచేస్తోంది. అందుకని కొన్ని మామూలు విషయాలను ప్రత్యేకంగా చర్చించుకో వలసిన అగత్యం ఏర్పడుతోంది.
ఈ సందర్భంలో కొన్ని అనుకూలవిషయాలను కూడా గుర్తుచేసుకోవాలి. తెలుగుతో సంపర్కం కోల్పోకుండా ఉండేందుకు ఈరోజుల్లో ఎన్నో సదుపాయాలున్నాయి. ప్రపంచంలో ఎవరు ఏ మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నా సాటి తెలుగువారు లేకపోయినప్పటికీ ఇంటర్నెట్ ద్వారా అనేక తెలుగు పత్రికలూ, వెబ్సైట్లూ, తెలుగులో సమాచారమూ, సంగీతమూ అందుబాటులో ఉంటాయి. అలాగే చాలా చోట్ల తెలుగు టీవీ చానల్ సదుపాయం లభిస్తోంది. వీటన్నిటితో బాటు తగినంత ఆసక్తి ఉన్నట్టయితే తెలుగు పుస్తకాలూ, పత్రికలూ, పాటలూ తమవద్దకు తెప్పించుకోవడం తెలుగువారికి అసాధ్యమేమీ కాదు.
తెలుగు విషయంలో వ్యక్తిగతస్థాయిలో సామాన్యుడు చెయ్యగలిగినదేమైనా ఉందా? సమస్యకు పరిష్కారం కుటుంబస్థాయిలో పిల్లలతో మొదలవాలి. మాతృభాష నేర్చుకోవడానికి అయిదేళ్ళ లోపు వయసే ఉత్తమమని నిపుణులంటారు. పదిహేనేళ్ళు వచ్చే లోపునే మాతృభాషలో బాగా మాట్లాడడం, చదవడం, రాయడం అలవాటైతే ఇక పరవాలేదు. మధ్యతరగతివారిలో మాతృభాషమీదా, అందులోని సాహిత్యాంశాల మీదా మంచి అభిరుచి కలిగే 15-25 ఏళ్ళ వయసులో యువతీ యువకులకు వృత్తిపరంగానూ, ఆర్జనకు పనికొచ్చే రీతుల్లోనూ ఇతర విషయాలమీద ధ్యాసపెట్టడం ఈ రోజుల్లో తప్పనిసరి అవుతోంది. అవన్నీ మానుకుని తెలుగు భాషాసౌందర్యాన్ని ఆస్వాదించమని వారికి చెప్పి లాభం లేదు. ఇదిలా ఉంటే మరొకవంక లాభార్జన కోసమని తల్లినీ, చెల్లినీ అమ్మేసే వర్గాలు ప్రభుత్వంలోనూ, ప్రసార, ప్రచార మాధ్యమాల్లోనూ రాజ్యం చేస్తున్నాయి. నేటి యువత ఈ ఒత్తిళ్ళన్నిటికీ గురవుతోంది. అందుకని బలమైన శక్తులకు లోనవుతున్న యువత పరిస్థితిని కూడా మనం కాస్త సానుభూతితో అర్థం చేసుకోవాలి. అటు తెలుగు తప్ప మరేదీ రాని పేద ప్రజలకు ఇప్పటికే ఉన్న బాధలతో బాటు తెలుగు ఉపయోగించని అధికార యంత్రాంగంతో మరిన్ని కష్టాలు ఎదురవు తున్నాయి. మధ్యతరగతికి చెందినవారు పూనుకుంటే తప్ప తెలుగుభాషకు సరైన తోడ్పాటు లభించదేమోననిపిస్తుంది.
ఎవరైనా మరీ కష్టపడకుండా చెయ్యదగినపెన్నో ఉన్నాయి. నివసిస్తున్నది ఏ ప్రాంతమైనా తెలుగు కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో తెలుగులో మాట్లాడడం, టీవీ, రేడియోల్లో తెలుగు కార్యక్రమాలు ఇంట్లో పెట్టుకోవడం, వీలున్నప్పుడల్లా మంచి తెలుగు పుస్తకాలు కొని, వాటిని తీరిక వేళల్లో చదివేలా పిల్లల్ని ప్రోత్సహించడం మొదలైనవన్నీ సులువుగా చెయ్యదగిన ప్రయత్నాలు. ప్రవాసాంధ్ర కుటుంబాల్లో తెలుగు అనేది కేవలం అమ్మా నాన్నా మాట్లాడుకునే కోయభాష అనే భావన పిల్లల్లో తగ్గడానికి వాళ్ళని తెలుగు నేర్చుకోవాలని నిర్బంధపెడితే ఉపయోగం ఉండదు. తమ పిల్లలు తెలుగు నేర్చుకోకపోవడం అపరాధం అనే భావన కలిగించడం కన్నా తెలుగులో చదివి ఆనందించ దగిన చిన్న పిల్లల పత్రికలూ, జోక్సూ, నాటికలూ, పాటలూ, పాత సినిమాలూ ఉన్నాయని పిల్లలకు తెలియజేసి, వారిని ఆకర్షించవచ్చు. ఏ ముళ్ళపూడి బుడుగు పుస్తకమో, శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకమో చదవలేనివారికి వారు "మిస్" అవుతున్నదేమిటో ఎలా వివరించగలం? ఉపాయాలు ఎవరికి వారే వెతుక్కోవాలి. ఉదాహరణకు బొంబాయిలో ఉన్నప్పుడు మా పిల్లల చేత డి.వి.నరసరాజుగారి "వాపస్"వంటి సులువైన నాటికలను వేయించాం. చూసినవారికే కాక వేసిన పిల్లలకు కూడా సంతోషం కలిగింది. పిల్లలకు స్వతహాగా ఇటువంటి ప్రేరణ కలగదు. అందుకని పెద్దలు తమ సంస్కారాన్ని మరిచిపోకుండా ఉంటే అది పిల్లలకు కాస్త అబ్బే అవకాశం ఉంటుంది. పుట్టినప్పటినుంచీ ప్రవాసాంధ్రులుగానే జీవిస్తున్న నావంటివారికి చిన్నతనపు ఇంటి వాతావరణమే తెలుగుభాషతో సంపర్కం కోల్పోకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇందులో భాగంగా తెలుగు చదువరులను ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా బాగా జరగాలి. ప్రతిభ ఉన్నవారు తెలుగు గురించి మథనపడడం కన్నా తెలుగులో రచనలు చేస్తూ ఉండడం ముఖ్యం. కల్పనా సాహిత్యంలోనూ, వ్యాసాల్లోనూ వివిధ అంశాల గురించిన తెలుగు రచనలు రావాలి. జీవితాలూ, అనుభవాలూ, దృక్పథాలూ విశాలతరం అవుతున్న పరిస్థితిలో వాటన్నిటినీ ప్రతిబింబించే ఆరోగ్యకరమైన రచనలు వెలువడుతూ ఉంటే భాషతో బాటు పదసంపదా, వ్యక్తీకరణ పద్ధతులూ అన్నీ ఆధునికం అయే అవకాశం ఉంది. తెలుగులో రచనల రాశి పెరిగితే అందులో కొన్నయినా మంచివి వెలువడి పాఠకులకు ఉపయోగకరం కావచ్చు. ఆధునిక మాధ్యమాలన్నిటినీ చక్కగా ఉపయోగించుకో గలిగితే తెలుగుభాష గురించి మరీ నిరాశ చెందనవసరం లేదేమో.
మరొకటేమిటంటే అయిదేళ్ళకొకసారి మనవారికి ఏదో ఒక విధంగా "గత వైభవాన్ని" గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త పాఠకులూ,శ్రోతలూ, ప్రేక్షకులూ తయారవుతూ ఉంటారు. మంచి తెలుగు రచనలని పునర్ముద్రించి యువపాఠకులకి వాటిని పరిచయం చెయ్యాలి. తెలుగు రచయితలూ, విలేకరులూ, పాత్రికేయులూ తమ బాధ్యతలను గుర్తించి, వాటిని సక్రమంగా నిర్వర్తించ గలిగితే సమస్య మరీ తీవ్రం కాకుండా ఉంటుంది. ఇవన్నీ నాకు తోచిన కొన్ని విషయాలు మాత్రమే. విజ్ఞులైన పెద్దలు ఇలాంటి విషయాల గురించి కాస్త ఆసక్తి ప్రదర్శిస్తే మంచి ఉపాయాలు లభించకపోవు.

1 comment:

Sankar said...

చాన్నాళ్ళ తర్వాత చిక్కని, చక్కని తెలుగులో ఒక వ్యాసం చదివిన అనుభూతి కలిగింది. బ్లాగరులందరూ ఒకసారి ఆలోచించి సాధ్యమైనంతవరకూ తెలగునే వాడడం మొదలుపెడితే సమీప భవిష్యత్తులో అన్నీ ఇలాంటి ముత్యాలే దొరుకుతాయనుకుంటున్నాను.
కామేశ్వరరావుగారు,
ఇప్పుడే కూర్చుని మీ బ్లాగంతా పరికించేసాను. మీ భాషాభిమానం చూసి ఒకరకమైన పులకింత కలిగింది. ఎందుకో తెలీదు ఒక్కోసారీ విషయం అంత ఆకట్టుకొనేది అవ్వకపోయినా కొన్ని వ్యాసాలు రచయిత్రి(త) భాషా సంపద వల్లనేమో చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీ వ్యాసాల్లో వాడుతున్న తెలుగు చాలా బావుంది. మరికొంచెం సాన పెడితే ఇంకా కమ్మాగా ఉంటుంది.