ముందుగా నా ఆలోచనలకి ప్రతిస్పందించిన అందరికీ మరోసారి నెనరులు. నా టపా, సహజంగానే, కొన్ని ప్రశ్నలని లేవనెత్తింది. వాటిపై నా అభిప్రాయాలని మీతో పంచుకోడానికే ఈ టపా. తలెత్తిన ప్రశ్నలు స్థూలంగా ఇవి:
1. మన మాటల్లో ఎలాంటి పదాలకి ఖచ్చితంగా తెలుగే వాడాలి, ఎలాటివాటికి అక్కరలేదు?
2. ఇంగ్లీషు పదాలు తెలుగులో కలిసిపోవడం సహజమైన పరిణామం కాదా? దాని గురించి ఇంత హైరానా పడాల్సిన అవసరం ఏమిటి?
3. తెలుగు భాషలో చాలా కన్నడ, తమిళ, సంస్కృత పదాలు చేరినట్టే ఇంగ్లీషు పదాలు కూడా చేరి భాషని పరిపుష్టం చేస్తున్నాయి కదా?
మొదటి ప్రశ్నకి సమాధానం సులువు కాబట్టి దానితోనే మొదలుపెడతాను. నిజానికి ఇందులో గిరిగీసుకోవాల్సినదేమీ లేదు! నేనన్నదాంట్లో సారాంశం, ఇంగ్లీషు పదాలు వాడుకని తగ్గించే ప్రయత్నం మనం గట్టిగా చెయ్యాలని. ఎవరికి ఎంతవరకూ వీలయితే అంతవరకూ చేసుకుపోడమే. అయితే ప్రతిపదం అచ్చతెలుగులోనే ఉండాలీ అన్న పట్టుదల మాత్రం నాకు లేదు. ఉదాహరణగా నేను "ఫేషను" పదాన్ని ఇచ్చాను. మరికొంత స్పష్టత కోసం ఈ వాక్యాలు చూడండి:
Easy Question pick చేసుకొన్నారు. correctగా answer చేసారు.
మీకు rains పడుతున్నాయా? ఈ రోజు మార్నింగే పడింది.
First candidate కి fourteen out of twenty marks వచ్చి winner అయ్యాడు.
ఒక అయిదు నిమిషాలు టీవీ చూస్తే వినిపించిన వాక్యాలివి. ఇందులో ఎంతశాతం తెలుగు, ఎంతశాతం ఇంగ్లీషు? నేను నా ముందు టపాలో చెప్పినది ఇలాటి చొరబాటు గురించి. మన భాషని రక్షించుకోవాలంటే, ముఖ్యంగా ఇలాటి విపరీతమైన చొరబాటుని అడ్డుకోవాలన్నది నా అభిప్రాయం.
పైన చెప్పిన ఉదాహరణ కాక మనం మరికొన్ని సందర్భాలలో ఇంగ్లీషు పదాలు వాడుతూ ఉంటాము:
1. చాలా ఏళ్ళుగా (కనీసం ఏభైసంవత్సరాలుపైగా) ప్రయోగించబడుతూ, మన భాషలో భాగమైపోయిన పదాలు. ఉదాహరణకి రోడ్డు, వయా మొదలైనవి.
2. రోజువారీ ఉద్యోగానికి సంబంధించిన పదాలు - ఉదాహరణకి client, appraisal మొదలైనవి
3. ఆధునికకాలంలో మనకి కొత్తగా తెలిసిన వస్తువులూ, విషయాలు - ఉదాహరణకి Computer, email, internet మొదలైనవి
పై మూడురకాలైన పదాలకీ తెలుగుపదాలే వాడాలా, ఇంగ్లీషుపదాలు వాడుకోవచ్చా అన్నది (కనీసం కొందరికి) చర్చనీయాంశమే. కానీ ప్రస్తుతం అది నా చర్చకి అప్రస్తుతం. నేను వీటి గురించి మాట్లాడలేదు. నా ఉద్దేశంలో, వీటికన్నా, నేను పైన ఉదహరించిన టీవీ సంభాషణల్లో కనిపించే ఇంగ్లీషుని నివారించడం ముఖ్యం.
ఇక రెండు మూడు ప్రశ్నలు. ఈ రెంటికీ సంబంధం ఉంది. కాబట్టి కలిపే వివరిస్తాను.
ఒక భాషలో పదాలు మరో భాషలో కలిసిపోవడం సహజ పరిణామమా కాదా అన్నది, నాకు తెలిసి, ఎవ్వరూ నిర్ణయించలేరు. ఇక్కడ సహజమంటే ఏవిటి అన్నది శాస్త్రీయంగా నిర్వచించడం బహుశా సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఈ కలిసిపోవడం అనేది ఎందుకు, ఎలా, ఎంత మోతాదులో జరుగుతోందనేది పరిశీలిస్తే, వీటిలో ఉన్న తేడాలు గమనించవచ్చు. మొదటగా ఎందుకన్న ప్రశ్న వేసుకుంటే:
1. పర భాషల ప్రజలతో సన్నిహిత సంబంధం - ఇది ఎక్కువగా రెండు భాషాప్రదేశాల సరిహద్దుల్లో ఎక్కువ గమనించవచ్చు. తెలుగులో కన్నడ, తమిళ, మరాఠీ భాషా పదాలు చేరడం దీనికి ఉదాహరణ. తెలుగుపదాలు కూడా ఆయా భాషల్లోకి వెళ్ళాయి.
2. రాజ్యభాష లేదా పరిపాలనా భాష ప్రజలభాష మీద ప్రభావం చూపించడం. దీనికి ఉదాహరణగా బహుశా ఉర్దూ, సంస్కృతమూ చెప్పుకోవచ్చేమో. (దీనిగురించి నాకు పూర్తిగా తెలీదు. ప్రస్తుతానికి దీనిపై వాదన అనవసరం).
ఒక భాషలో(మాతృభాషలో) మరో భాష(పరాయిభాష) కలిసినప్పుడు సాధారణంగా పరాయిభాషలోని పదాలు మాతృభాషలోని పదాల రూపంలోకి మారిపోతాయి. ఉదాహరణకి మన తెలుగులో నామవాచకాల చివర "డు ము వు లు" చేరడం, హలంతమైన పదాలు అజంతాలుగా మారడం ఇలాటి మార్పులు. పరభాషాపదాల ఉచ్చారణకూడా మాతృభాషలోని ఉచ్చారణకి దగ్గరవుతుంది. ఉదాహరణకి ఉర్దూలో ఉన్న "జ"ఉచ్చారణా, తెలుగులోని "జ" ఉచ్చారణా వేరు. తెలుగులోకి వచ్చిన ఉర్దూ పదాలని తెలుగు "జ" ఉచ్చారణతోనే పలుకుతాం, చాలావరకూ. ఇంకా ఇలాటి మార్పులు మరికొన్ని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే, పరభాష మాతృభాషకి చాలా దగ్గరదైతే తప్పిస్తే, పరభాషలోని పదాలు మాతృభాషలోకి వచ్చినప్పుడు వాటి రూపం కచ్చితంగా మారుతుందని చెప్పవచ్చు. మాతృభాషకుండే వ్యాకరణం (వాక్య నిర్మాణం వగైరా), పరభాష వల్ల మారడం చాలా అరుదు.
ఇక, ఈ భాషల కలయిక అన్నది సాధారణంగా ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమయ్యి ఉంటుంది.
పై విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీషు మన భాషలో ఎలా కలుస్తోందో ఒక్కసారి ఆలోచించండి. ఇంగ్లీషు మన భాషలోకి రావడానికి కారణం పైన చెప్పుకొన్న రెండు కారణాలూ కావుగదా. మరి దేనివల్ల? ఆర్థిక కారణాలవల్ల అన్నది మనకి వెంటనే తట్టే జవాబు. కానీ ఇది సరైన కారణమేనా? దీనిగురించి కాస్త ఆలోచిస్తూ ఉండండి. ఇంగ్లీషు తెలుగులో ఎలా కలుస్తోందో చూసి, మళ్ళీ ఇక్కడికి వద్దాం.
ఇంగ్లీషులో చాలాపదాలు పైనచెప్పుకొన్న తరహాలో మార్పులు చెంది తెలుగులో కలిసిపోయిన మాట నిజమే. కానీ ప్రస్తుత పరిస్థితి అది కాదే! ఇంగ్లీషు పదాలని ఏ మార్పూ జరగకుండానే యథాతథంగా తెలుగు వాక్యాలలో ప్రయోగిస్తున్నాం. ఏకంగా పదబంధాలకి పదబంధాలే ఇంగ్లీషులోవి తెలుగు వాక్యాలలో దర్శనమిస్తున్నాయి. మరొక వింత మీరు గమనించే ఉంటారు. తెలుగుని కూడా ఇంగ్లీషు ఉచ్చారణకి దగ్గారగా చాలా మంది పలకడానికి ప్రయత్నం చేస్తున్నారు! మరి ఇది ఇంగ్లీషు తెలుగులో కలవడమా? తెలుగే రానురాను ఇంగ్లీషుగా మారిపోవడమా? మన తెలుగులో లేని పదాలు ఇంగ్లీషునుంచి స్వీకరించి, తెలుగుకి అనుగుణంగా మార్పు చేసుకుంటే, మన భాష పరిపుష్టమవుతోందని అనుకోడానికి అవకాశం ఉంది కానీ, ఇలా మన భాషలోని పదాలని విడిచి(తుడిచి)పెట్టి పరభాషా పదాలని తెచ్చుకోవడం భాషని పరిపుష్టం చెయ్యడమెలా అవుతుంది?
ఎన్నో పరభాషా పదాలు తెలుగులో కలిసినప్పుడు, ఒక్క ఇంగ్లీషుని మాత్రం బహిష్కరించడం ఎందుకనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికిందనే ఆశిస్తున్నాను. ఇతర భాషాపదాలు మన తెలుగుభాషలో కలిసిన తీరువేరు. ఇంగ్లీషు పదాలు కలుస్తున్న తీరువేరు. ఒకవేళ ఏ భాషైనా (సంస్కృతమని కొందరంటారు) మన తెలుగుభాషా స్వరూపం మారిపోయేటట్టు తెలుగులో కలసిపోయిందని అనుకున్నా, అది జరిగి కనీసం వెయ్యేళ్ళయిపోయింది. దానిగురించి ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏమీ లేదు, చెయ్యాల్సిన అవసరం కూడా నాకు కనిపించదు. కళ్ళ ముందిప్పుడు ఇంగ్లీషు మన తెలుగుభాషని ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం దాన్ని ఆపడానికి (కనీసం తగ్గించడానికి) ప్రయత్నం చెయ్యాలా అక్కరలేదా?
ఈ విషయమై నేనీ మధ్య ఒక మంచి ఇంగ్లీషు వ్యాసం చదివాను. దీన్ని రాసినతను Salikoko S. Mufwene. ఈ టపా చివరలో దాని లింకు (లంకె?) ఇస్తున్నాను (ఇక్కడే ఇస్తే నా టపా పూర్తిగా చదవకుండా అక్కడికి చెక్కేస్తారేమోనని భయం:-).
ఇంగ్లీషు వల్ల ఇతరభాషలు అంతరించిపోతాయనే భయం వట్టి భ్రమ మాత్రమే అని చెప్పే వ్యాసమది. ఇది చూసి చాలా ఆనందించి, ఉత్సాహంగా ఆ వ్యాసం చదివాను. తీరా చదివాక తెలుగు విషయంలో, ఆశ కాదు కదా, భయం మరింత పెరిగింది! ప్రపంచంలో చాలామంది ఇంగ్లీషుని కేవలం బయట ప్రపంచంతో వ్యాపార వాణీజ్యాలకి మాత్రమే వాడుతున్నారనీ, ఆంతరంగికంగ కార్యాలకీ రోజువారీ సంభాషణలకీ తమ స్వభాషనే వాడుతున్నారనీ, అందువల్ల అలా జరిగినంత కాలం వారివారి దేశభాషలకి జరిగే నష్టమేమీ లేదనీ ఆ వ్యాసంలోని సారాంశం. దీనికి ఉదాహరనగా Japan, Hong Kong, Taiwan మొదలైన దేశాలని ప్రస్తావించారు.
మనకి మాత్రం ఇంగ్లీషు మన నిత్యవ్యవహారంలో భాగమైపోతోందే! అంటే ఈ వ్యాసరచయిత సూచించినట్టు మన భాష అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్టేగా!
ఇప్పుడు తిరిగి మనం సగంలో వదిలేసిన విషయానికి వద్దాం. ఇంగ్లీషు వాడకం వెనక కారణము కేవలం ఆర్థిక లాభమే అయితే, పై వ్యాసంలో ప్రస్తావించబడిన దేశాల మాదిరి, మన ఇంగ్లీషు వాడకం కూడా మన ఉద్యోగ వ్యాపారాలకి మాత్రమే పరిమితం అయి ఉండాలి కదా. రోజువారీ జీవితంలో ఇంతగా ఇంగ్లీషు చొచ్చుకుపోవడానికి కారణం ఏమిటి? దీనికి కూడా ఆ వ్యాసంలో కొంతవరకూ సమాధానం దొరికింది. భాష సంస్కృతిలో ఒక భాగం. సంస్కృతి మార్పు చెందుతూ ఉంటే దానికనుగుణంగా భాషకూడా మార్పు చెందుతుంది. ఇప్పుడు మన భాషలో వస్తున్న మార్పు కూడా మన సంస్కృతిలో వస్తున్న మార్పులోని భాగంగానే అర్థం చేసుకోవాలన్నమాట. అలానే భాషలోని మార్పు సంస్కృతిలో కూడా మార్పు కలిగిస్తుంది. సంస్కృతి కాలంతో పాటు మారుతుందనడంలో సందేహం లేదు. కానీ, ఆ మార్పు ఏ దిశగా జరుగుతోంది, దాని వల్ల మనకేమిటి లాభం, ఏమిటి నష్టం అని బేరీజు వేసుకోగలిగే పరిపక్వత ఇప్పుడు మనకుందని నేననుకుంటున్నాను. ఈ జరుగుతున్న మార్పు, కేవలం మార్పు కాదు, పరాయి సంస్కృతి మన సంస్కృతిని ఆక్రమించుకోవడం అని నేను భావిస్తున్నాను. దానికి భాషలో మార్పులే ప్రబల నిదర్శనం.
వెనకటికి బ్రిటిషువాళ్ళు పరిపాలించే రోజుల్లోకూడా కొంతమంది - మన దేశాన్ని ఇంతకు ముందు చాలామంది దండెత్తారు, ఆక్రమించుకొని రాజ్యాలుకూడా చేసారు. ఇప్పుడు బ్రిటిషువారు చేస్తున్నదీ అదే. ఇందులో మనం అడ్డుకోవలసిందీ పోరాడవలసిందీ ఏముందీ? - అని అనేవారట. మరి ఆ రోజుల్లో అందరూ అలాగే అనుకుంటే ఇప్పుడు మనకి భారతదేశం అనేదే ఉండేది కాదు కదా!
అలాగే ఇప్పుడు జరుగుతున్నది సాంస్కృతకమైన ఆక్రమణ, మనం విదేశ సంస్కృతికి బానిసలమవుతున్నామన్న స్పృహ కలగకపోతే, మన అస్తిత్వాన్ని కోల్పోతామని నాకనిపిస్తోంది.
ఆర్థికంగా మనం విదేశాల ఆర్థికవ్యవస్థపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి కూడా, కొంతవరకూ దీని పర్యవసానమే అని నాకనిపిస్తుంది.
మరి దీన్ని ఎలా ఆపడం? సొంతభాషని కాపాడుకోడం ఈ దిశగా మనం వేసే మొదటి అడుగని నా నమ్మకం.
Colonisation, Globalisation, and the Future of Languages in the Twenty-first Century - Salikoko S. Mufwene
Tuesday, July 22, 2008
"ఒంటె-సుల్తానుగారి డేరా" కథ విన్నారా?
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
మీ ఆవేదన అర్ధం అయింది. అయితే తెలుగు మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోకి కూడా ఇంగ్లిష్ భాషా పదాలు చొచ్చుకు వచ్చేస్తున్నాయి. దీన్ని మనం ఆయా భాషల టి.వి. చానళ్ళలో చూడవచ్చు. దీనికి ముఖ్య కారణం మీరు చెప్పిన ఆర్ధిక కారణాలతో బాటుగా మారుతున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానిక భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు జరగడం లేదు. చైనా, జపాన్ వంటి దేశాల్లో అక్కడి శాస్త్రవేత్తలు తమ మాతృభాషలోనే వున్నత విద్యని అభ్యసిస్తారు. అక్కడి ప్రభుత్వాలు అనువాదంపై ప్రత్యేక శ్రధ కనబరుస్తాయి. కాని ఇక్కడి పరిస్తితి అది కాదు. ఒకవేళ అనువాదం చేసినా (తెలుగు అకాడెమి వంటివారు ఈ దిశలో కొంత ప్రయత్నం చేశారు) అవి పలకడానికి క్లిష్టమయిన సంస్కృత భాషా పదాలతో నిండి ఉండడం వల్ల, జనానికి, ముఖ్యంగా విద్యార్ధి లోకానికి చేరువ కాలేక పోయాయి.
no comment
ఇంగ్లీషు తమ భాషని మింగేస్తోందన్న ఆవేదన చాలా దేశాలకు ఉంది. ఫ్రెంచివారు aftershave వంటి పదాలను వాడటానికి ఇష్టపడరు. జపాన్లో ఇంగ్లీషు మాటల్ని యథాతథంగా తమ 'యాస' లోకి మార్చేసి, అది తమ పదమే అంటారట (కంప్యూటాః వగైరా!).
ఉర్దూ అధికారభాషగా ఉన్నప్పటి ప్రభావం కోర్టు విషయాల్లో ఇప్పటికీ కనబడుతుంది. వకీలు, పేషీ, పేష్కష్, దస్తావేజు, రాజీనామా, జమాబందీ మొదలైన మాటలన్నీ అటువంటి అవశేషాలే. తెలుగు పదాలు ఉపయోగించగలిగినప్పుడు అనవసరంగా ఇంగ్లీషువి వాడడం మొదట్లో 'ఫాషన్ ' అనిపించిందేమో కాని ప్రస్తుతం తెలుగులో ధారాళంగా మాట్లాడలేకపోవడం ఒక దురలవాటుగా కనిపిస్తోంది. తమిళనాడులో ద్రా.ము.క. పార్టీ పనికట్టుకుని సంస్కృతీపరంగా మాతృభాషని ఉద్ధరించే ప్రయత్నం చేసింది కనకనే ఆ విషయంలో వారికి మనకన్నా ఆత్మగౌరవం నిస్సందేహంగా ఎక్కువ అనే భావన కలుగుతుంది.
మీరు చెప్పింది నిజమే
మన సంస్కృతి లో కుడా చాలామార్పులు వచ్చాయి
తెలుగు భషే కాదు మన భారతీయ భాషల్లో కూడా చలా మార్పులు వస్తున్నాయి
లేచిన దగ్గరనుంచి నిద్రపోయేలోపు మాట్లాడే కనీస మాటల్లో కూడా ఆంగ్లమే
ఎంతైనా దూరపు కొండలు నునుపు కదా
ప్రస్తుతం కాకపోయినా, సుమారు రెండోందల Yఏళ్ళు ఆంగ్లం రాజ్యభాషగా వెలిగింది. అటుపైన, సాంస్కృతికంగా రెండు పరిణామాలు జరిగాయని నాకనిపిస్తుంది. సాధారణంగానే మన దేశంలో పట్నవాసపు పద్ధతులు, వేషభాషలు, ఉద్యోగస్తుల తీరుతెన్నులు అందరికీ ఆచరణయోగ్యంగా కనిపించాయి. సమాజంలో ఒక్కొక్క తలంలో ఉన్న ప్రజలూ తమ పై మెట్టు మీద ఉన్న వర్గాన్ని అనుసరించడం ఒక ముఖ్య లక్షణం .. దానిలో భాగమే ఇంగ్లీషు చదువు, ఇంగ్లీషు మాట్లాడ్డం.
రెండోది, ప్రపంచ వ్యాప్తంగా వినోద పరిశ్రమని అమెరికా గుత్తకి తీసుకుంది. సినిమాలు, ఆ పైన టీవీ కార్యక్రమాలు నిరంతర ప్రసారంలో అమెరికను పద్ధతుల్ని అనుసరించడం ఫేషను అనే భావన (ఇది మనకొక్కరికే కాదు, ప్రపంచ మంతానూ).
నా ఉద్దేశం లో, మూడో కారణం .. మొదటి నించీ కూడా మన భాష మీద మనకి ఒక అభిమానం గౌరవం లేక పోవడం. ఎక్కడో తంజావూర్లో మన వాళ్ళు రాజ్యం చేసి తెలుగు భాషా కవిత్వాల్ని పోషించారు గానీ, ఆంధ్ర దేశాన్ని సుస్థిరంగా ఏలి, తెలుగు భాషని నెత్తిన పెట్టుకున్న ఒక్క రాజుని చెప్పండి? (రాయలు తెలుగు రాజు కాదు, కన్నడ రాజు .. ఆ సంగతి ఆయనే చెప్పుకున్నాడు).
చివరిగా .. తెలుగుని మాట్లాడమంటే ఆంగ్లాన్ని తోసి రాజన్నట్టు కాదని జనాలు గుర్తించాలి. ఒక మనిషి నాలుగైదు భాషలు నేర్చుకోవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. ఇది మనది, ఇది మన సంస్కృతిలో భాగం, దీన్ని మనం నిలబెట్టుకోవాలి, ఆచరించాలి అని అనుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ముందస్తుగా ఈ సంకర భాష ని నిలిపి వెయ్యాలి.
తెలుగుభాషపై మీ ఆవేదన నేను గమనించగలను. కానీ, మీరు సమస్యని తప్పుగా అర్థం చేసుకున్నారు.
మన సమాజంలో ప్రతిఒక్కడు విద్యావంతుడు కానప్పటివరకూ, మన తెలుగుభాష కుంచించుకుపోవడం తప్పదు.
భాషకి మూలం విద్యావంతులే. వీరే సంగీత సాహిత్యాలు రచించి, భాషకి జీవం తెస్తారు. ఇటువంటి విద్యావంతుల సమాజం భాషకి దిశానిర్దేశం చేస్తుంది.
ఒకప్పుడు బ్రాహ్మణులే విద్యావంతులు. వారి భాష ఐన సంస్కృతం తెలుగుకి జీవం పోసింది. ఇప్పుడు, మనలాంటి విద్యావంతులు ఎక్కువ సమయం మిగతా భాషలు మాట్లాడడానికే వెచ్చిస్తున్నాం. మన మిత్రులలో ఎక్కువమంది ఆంగ్లభాషితులే. కనుక, తప్పనిసరిగా ఆంగ్ల ప్రభావం తెలుగుపై ఉంటుంది.
ఆంగ్ల భాషని ఒక కలుపు మొక్కగానో, చీడ పురుగుగానో భావించకండి.
తెలుగు భాష పతనానికి అసలు కారణం తెలుగు నేలలో విద్య సన్నగిల్లిపోవడం. ప్రజలందరూ విద్యావంతులైననాడు భాష అదే విరాజిల్లుతుంది.
మీరు చెప్పిన ఉదాహరణ, ఓ టీవీ చానెల్లో వాడిన భాష. మన టీవీ వాళ్ళకు పట్టిన జాడ్యం, తెలుగు ని ఆంగ్లం లాగా మాట్లాడ్డం, తెలుగులో ఆంగ్లపదాలు గుప్పించడమ్ వగైరా...వాళ్ళను మనం ఏం చేయగలం, ఖర్మ కు వదిలేయడం తప్ప?
ఇలా సాధారణంగా ప్రతిచోట జరుగుతోందా? నా వరకు నాకు అలా కనిపించడం లేదు.
వృత్తి అవకాశాల కోసం సొంత వూళ్ళను, దేశాన్ని వదిలి వెళ్ళవలసి వస్తున్న రోజులివి. ఆంగ్ల పదాలు తెలుగులో చొరబడడం అన్నదానికి కారణం కూడా అదే. ఐతే పూర్తిగా తెలుగు పదాలు, పదబంధాలే కనుమరుగవుతున్నాయి అనడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది.
"ఆర్థికంగా మనం విదేశాల ఆర్థికవ్యవస్థపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి కూడా, కొంతవరకూ దీని పర్యవసానమే అని నాకనిపిస్తుంది."
ఇదీ ఆశ్చర్యకరమే. నా వరకు తోచిన కారణం, భారత దేశం సంప్రదాయికమైన వ్యవసాయ బాటను వదిలి, యాంత్రిక ఉత్పత్తులపై ఆసక్తి పెంచుకోవడం.
ఈ వ్యవహారం భాషకు యే రకంగా ముడిపడి ఉంది?
ఇక పోతే, ప్రయత్న పూర్వకంగా తెలుగు పదాలు వాడటం అన్నది, తెలిసో, తెలియకో, బ్లాగు లోకం వరకూ జరుగుతున్నది అని నా నమ్మిక. ఉదాహరణ కు ప్రవీణ్ గారి సాంకేతిక టపాలలో మనకు, "బొత్తాం", "విహరిణి", "దింపుకోవడం" వంటి పదాలు కనబడతాయి.
@జగదీష్ గారు,
మీరు చెప్పినది నిజమే. మీరన్నట్టు కొత్త సాంకేతిక/పారిభాషిక పదజాలం మన భాషలో సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలా అన్నది తర్వాతి ప్రశ్న. అయితే, అంతకన్నా ముందు, మనకున్న భాషనీ అందులోని పదాలనీ పోగుట్టుకోకుండా చూసుకోడం ఇంకా ముఖ్యమన్నదే నా ఉద్దేశం.
@రాజేంద్రగారు, మీరు "నో కామెంట్"అని ప్రత్యేకంగా ఓ కామెంటుపడేసారు! దీనిభావమేమి?
@రోహిణీప్రసాదుగారు,
తమిళులుచేసినట్టు మన తెలుగులోకూడా అలాంటి ప్రయత్నం మనం ఎందుకుచెయ్యకూడదూ అన్నదే నా ఆలోచన.
@కొత్తపాళీగారు,
మీరన్నటు బ్రిటిషువాళ్ళకాలంలో ఇంగ్లీషు చాలావరకూ రాజ్యభాషగా ఉండడం వాస్తవమే. కానీ ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి - ఆ రోజుల్లో ఇంగ్లీషువాళ్ళు తమ రాజకీయప్రయోజనాల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయభాషలు నేర్చుకొని, అందులో పరిపాలన సాగించే ప్రయత్నం చేసారు. రెండు - నేను నా టపాలో చెప్పిన రైలు, వయా వంటి పదాలు ఇంగ్లీషువాళ్ళవల్లనే కదా వచ్చింది. అయితే ఆ కాలంలో ఇంగ్లీషు మన భాషపై చూపించిన ప్రభావం, ఇప్పుడు చూపిస్తున్న ప్రభావం ఒక రకంగా లేవని మనం గుర్తించాలి. శాస్త్రీయంగా పరిశీలిస్తే, ఖచ్చితంగా ఈ తేడా మరింత బాగా వెల్లడవుతుందని నా నమ్మకం.
మీరు చెప్పిన కారణాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. తెలుగుని కాపాడుకోవాలంటే ఇంగ్లీషుని ద్వేషించడమో, నిరాదరించడమో కానేకాదన్నది అందరూ స్పష్టంగా తెలుసుకోవాలి.
@రేగారు,
మీరన్నదీ, నేనన్నదీ నాకు ఒకటేననిపించిందే! మరి నేను తప్పుగా అర్థంచేసుకున్నానని ఎందుకన్నారో నాకర్థంకాలేదు.
@రవిగారు,
నేనిచ్చి ఉదాహరణలు ఒక టివీ చానల్నించి కాదండీ, రెందుమూడు టీవీ చానళ్ళనించి. అయినా, మీకిది ఎక్కువగా కనిపించకపోవడం మీ ఆశావహ దృక్పథం వల్లనేమో:-) లేదా నాకింత ఎక్కువగా కనిపించడం నా నిరాశావహ దృక్పథం వల్లనో :-(
మీరన్నట్టు ఇది టీవీ చానళ్ళకే పరిమితం అనుకొందాం, ఒక్క క్షణం. మరి టీవీ చానళ్ళు మాత్రమే ఎందుకలా విపరీతానికి పోతున్నాయో ఆలోచించండి.
నావరకూ నేను, ఇది టీవీలోనేకాకుండా ఆంధ్రాలో ఉన్న వాళ్ళ సంభాషణల్లోనూ చాలాచోట్లే గమనించాను, ఉద్యోగాలు చెయ్యని తెలుగు గృహిణులలోతో సహా!
ఇక ఆర్థికవ్యవస్థ గురించి, నేనన్నదాన్ని పూర్తిగా సమర్థించుకొనే సమాచారం నావద్దలేదు. అందుకే అది నా ఊహ అనే అన్నాను. దీనిగురించి మరోసారి వివరించడానికి ప్రయత్నిస్తాను.
మీరన్నట్టు, తెలుగు వాడుక గురించి ఇంటర్నెట్టులో ఎక్కువ స్పృహ కనిపిస్తోంది. అందుకే ఈ ప్రయత్నం ఇంటర్నెట్టులో మొదలుపెడితే విజయాన్ని సాధిస్తుందని నేననుకొన్నది!
కానీ ఎంతవరకూ సాధ్యమవుతుందీ అన్నది అనుమానమే. ముందు సమస్యని సరిగా గుర్తించగలగాలి. ఎక్కువ మంది దానితో అంగీకారించాలి. ఆ తర్వాత దానికి పరిష్కారమార్గాలని అన్వేషించాలి. మనలో చాలామందిమి తీరిక దొరికినప్పుడేదో మనకి తోచిన ఆలోచనలు చేసి, ఆవేశంగా ఒక నిట్టుర్పు విడిచేసి ఊరుకుంటాం. మరి కార్యరూపం దాల్చే దారేది?
http://andhrajyothy.com/editshow.asp?qry=/2008/jul/30edit4
సినీ హాస్యనటుడూ, రచయితా అయిన ఏవీఎస్ రాసిన ఈ వ్యాసంలో తెలుగు మాటలున్నప్పటికీ ఎన్ని ఇంగ్లీషు పదాలు 'అనవసరంగా' వాడాడో గమనించండి. ఇది 'ఆస్సెం' అనుకోవాలా?
నిజమే రోహిణీప్రసాదుగారు. అది హాస్యానికలా రాసారో, ఫేషననో, లేక రోజూ సినిమాలో అలాటి డైలాగులు చెప్పిచెప్పి అలవాటైపోయిందో!
నాకు హాస్యాస్పదమనిపించిన (నవ్వురాలేదు) మరో విషయం రాయలు తన ఆస్థానంలో కవులని అష్టదిగ్గజాలన్నాడు కానీ అష్టసింహాలనో మరోటో అనలేదని అనడం! దిగ్గజాలంటే పురాణాల్లో మన భూమిని అష్టదిక్కులలోనూ మోసే ఏనుగులనీ, వాటితో పోల్చడానికే గొప్పవాళ్ళని దిగ్గజాలంటారనీ, అందుకే రాయలు అష్టదిగ్గజాలని అన్నాడు తప్పిస్తే అతనికి ఏనుగంటే మోజుతో కాదనీ ఏవీఎస్కి తెలియదా?
Post a Comment