Wednesday, August 13, 2008

నేనెరిగిన తెలుగుదనం

ఎఱ్ఱంచు పంచెకట్టూ, పైన లాల్చీ, నుదుటన నిలువుగా తీర్చిన తిలకంతో పక్కన నడుస్తున్న తాతగారు, తన స్వగతాలని వినిపిస్తూంటే వింటూ, చెఱకు చేలమ్మటా, జీడితోటల్లోనూ తిరగడం...
తేగలు కాల్చుకు తినడం, తాటికాయలు చేతివేళ్ళతో జుఱ్ఱుకోడం, నవనవలాడే పనసకాయలు చిన్నాన్నలు కసకసకసా కొట్టి చేసిన సన్నని పొట్టుతో తయారైన పనసపొట్టు కూర వాసనా రుచీ ఒకేసారి తలకెక్కడం...ఇలా ఎన్నో...
చిన్నప్పుడు, అప్పుడప్పుడు, వేసవి సెలవల్లో అందీ అందక నాకందిన తెలుగుదనం!

నాన్న వినిపించిన రాయబారప్పద్యాలూ, అమ్మ నేర్పిన తెలుగు పాఠాలు, అమ్మమ్మ వల్లెవేయించిన శ్లోకాలూ, తాతతో కలిసి నింపిన "బాలజ్యోతి", "వనిత" గళ్ళ నుడికట్లూ...
మూడుకోవిళ్ళలోనో, గుంచీలోనో జరిగే హరికథలకి వెళ్ళడం, ఇంట్లో ఉన్న పాత చిడతలని పట్టుకొని పెద్ద హరిదాసులా "గజేంద్రమోక్షం" హరికథ వచ్చీరాని భాషలో చెప్పి అందరినీ మురిపించడం, వినాయకచవితి ఉదయాన్నే లేచి పత్రికోసం వేటా, భోగీ వచ్చిందంటే పెరట్లో ఏ చెట్టుకొమ్మల్ని విరపాలో, ఏ పాత కుర్చీలకి ఉద్వాసన చేప్పాలో పెద్దవాళ్ళతో గొడవా, దీపావళికి జువ్వల యుద్ధాలూ...ఇలా ఎన్నెన్నో...
పెద్దవుతూ నే ననుభవించిన తెలుగుదనం!

తెలుగు నేలమీద, తెలుగువాళ్ళ మధ్యలో, తెలుగు మాట్లాడుతూ, తెలుగువాడిలా బతికే ఆనందం...
నాకు దూరమైన తెలుగుదనం!

మీగడ అద్దుకు తినే ఆవకాయన్నం, ఉల్లిపాయి నంచుకుతినే గోంగూరా కందిగుండా, వెల్లుల్లితో ఘుమ్మెత్తించే పాఠోళీ, నిమ్మకాయ జల్లుకొని మధ్య మధ్య పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ తినే పసందైన పెసరపప్పూ...
ఇంకా నా జీవితంలో (మా ఆవిడ ధర్మవా అని) మిగిలున్న తెలుగుదనం!

"నాన్నా, పులి అంటే లయనా టైగరా?"
నేను జీర్ణించుకోలేకపోతున్న తెలుగుదనం :-(

4 comments:

వికటకవి said...

భాషలో భోజనం కలిపితే వచ్చే చిక్కే ఇది. ఆలోచనల్లో భోజన పదార్ధాలకి చేసినంత న్యాయం భాషకు చెయ్యలేకపోయా :-)

MURALI said...

ఎంతయినా మీకు కొన్ని మధురఙ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితాంతం నెమరు వేసుకు బ్రతికెయ్యొచ్చు. మన తరవాతి తరాలకి మాత్రం ఏమీ మిగల్చలేదు మనం అందుకు భాదపడాలి. అందుకే ఈ రోజు నా కవిత లాలీ జో.. లాలీ జో..

Naga said...

నన్ను చాలా కాలం బాధించిన విషయం ఇది. అయితే, నాకు తెలిసినంత వరకు తెలుగు భాష చరిత్ర ఇలాగే ఉంది. ఒక సారి మా తెలుగు మాస్టారు ఎనిమిదో శతాబ్దం నాటి తెలుగును చదివి వినిపిస్తే ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు.

Sky said...

నమస్కారం,
మీరు వ్రాసిన ఈ టపా నాకు ఎన్నో అనుభూతులను గుర్తుకుతెచ్చింది. మనం బాధపడాల్సిన విషయం మరొకటి వుండి. కనీసం మనకు ఈ రాయబార పద్యాలు, గజేంద్ర మోక్ష హరికధలూ చూసే అవకాసమయినా వుంది. అసలు భయపడవలసినది ముందున్నది -- ఇప్పటికే పద్యం అంటే ఏమిటో తెలియని పరిస్థితి వచ్చేసింది. ఇంక ఈ గజేంద్ర మోక్షం, హరి కధలు, బుర్ర కధలు సంగతి సరే సరి.

కానీ మీ శైలి బహు అందం గా వున్నది. "నేనెరిగిన తెలుగుదనం" అన్న ఈ పేరు దీనికి అందం గా అమరింది. ఒక్కసారి నా బాల్యం లోకి నన్ను తీసుకుని వెళ్ళారు. నేను చూసిన పల్లెటూరు, టౌన్ వాతావరణం ఒక్క సారి కళ్ళ ముందు మెదిలింది. ఒక కోన ప్రాణం తో కొట్టుకుంటున్న ఆ పల్లెల్లోని తెలుగుదనం ఈ కార్పొరేట్ సంస్కృతికి ఎప్పుడు కోదేక్కుతుందో అన్న ఆలోచనతో, కేవలం మీ ఈ టపా చదివి, ఒక్క సారి పల్లెకి పోయి వాడడం అన్న వుద్దేశం తో టికెట్టు కొనేసాను. పండగ కి పల్లెకి పోయి వద్దాం అని. ఇంతటి స్పందన ని కలిగించింది అని చెప్పటానికే మీకు వ్రాస్తున్నాను.

వీలయితే నా బ్లాగ్ ని కూడా ఒక సారి పరికించి తప్పొప్పులు తెలియజేయగలరు .

భవదీయుడు

సతీష్ యనమండ్ర